కరీంనగర్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగనుంది. పది మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఏకపక్షంగా కనిపిస్తున్నది. మొత్తం 1,324 ఓట్లకు గానూ 1,320 ఓట్లు పోలవగా, కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో లెక్కింపు కేంద్రం సిద్ధమైంది. 8 టేబుళ్లపై 7 రౌండ్లలో లెక్కించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలైన ఓట్లలో మూడో వంతు అంటే 440 ఓట్లు వచ్చిన వారిని విజేతలుగా ప్రకటించనుండగా, మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. సోమవారం సాయంత్రం కౌంటింగ్ కేంద్రాన్ని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తేలే రోజు రానే వచ్చింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఉదయం 6 గంటలకే సిబ్బంది రిపోర్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. 7.30 గంటలకు ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూం తాళాలు తెరిచి బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు. అన్ని ఓట్లను కలగలుపుతారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన 8 టేబుళ్లపై ముందుగా 25 బ్యాలెట్లను ఒక బండిల్‌గా కట్టలు కడుతారు. అర గంటలో ఈ ప్రక్రియను ముగించి ఉదయం 8 గంటల వరకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. పోలైన ఓట్ల సంఖ్యను బట్టి ఆరు 8 టేబుళ్లపై 6 రౌండ్లు, చివరిదైన 7 రౌండ్ 5 టేబుళ్లపై లెక్కిస్తారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, మరొక మైక్రో అబ్జర్వర్ చొప్పున నియమించారు. కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తోపాటు ఇతర అధికారులు ఈ ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు. సీపీ సత్యనారాయణ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ఆర్ కళాశాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులోకి తెచ్చారు. కరీంనగర్, జగిత్యాల మార్గంలో సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను ఉదయం నుంచే దారి మళ్లిస్తారు. పద్మనగర్, చింతకుంట మీదుగా శాతవాహన యూనివర్సిటీ నుంచి రేకుర్తి మీదుగా జగిత్యాల రోడ్డుకు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
మూడోవంతు ఓట్లు వచ్చిన వారే విజేతలు
రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు విజేతలవుతారోననే ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ప్రాధాన్యత ఓట్ల ప్రకారం అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో 1,324 మంది ఓటర్లు ఉండగా 1,320 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మూడో వంతుగా 440 ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒక వేళ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకుంటే రెండో ప్రాధాన్యతన ఓట్లను లెక్కిస్తారు. పోటీలో ఉన్న పది మంది అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కించి రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ మూడో వంతు వచ్చిన వారినే విజేతలుగా ప్రకటిస్తారు.
గెలుపు ధీమాతో కనిపిస్తున్న టీఆర్ఎస్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే గె లుపని అధికార టీఆర్ఎస్ ధీమాగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్షాన టీ భానుప్రసాద్ రావు, ఎల్ రమణ పోటీలో ఉన్నారు. మరో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ వెయ్యికిపైగా స్థానాల్లో విజయం సాధించింది. తమ పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజా ప్రతినిధులంతా తమకే ఓట్లు వేశారనే ధీమాతో కనిపిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లా మంత్రులు కేటీ రామారావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలు పార్టీ ప్రజా ప్రతినిధులను ఏకతాటిపైకి తేవడంతో కృతార్థులయ్యారు. ఈ ధీమాతోనే టీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కర్ణన్ తెలిపారు. సోమవారం స్థానిక ఎస్సారార్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థులు ఉన్నారని, కౌంటింగ్‌ను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఆర్డీవో ఆనంద్‌కుమార్, అర్బన్ తహసీల్దార్ సుధాకర్, కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రంలో కొవిడ్ నిబంధనలు
కౌంటింగ్ కేంద్రంలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బందితోపాటు ఏజెంట్లు తప్పనిసరిగా మా స్కులు ధరించాలని స్పష్టం చేశారు. శానిటైజేషన్ చేసుకోవాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. కౌంటంగ్ కేంద్రం వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.