పెద్దల సభ ఎన్నికల ప్రక్రియ కట్టుతప్పుతున్నది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభధ్రుల అభ్యర్థులు రెండు నెలలుగా విస్తృతంగా చేసిన ప్రచారం, రూటు మారింది. మొన్నటి వరకు సభలు, సమావేశాలు, ఉదయం, సాయంత్రం వేళల్లో ఓటర్లను కలిసి చేసిన క్యాంపెయిన్ ప్రలోభాల పర్వంలోకి వెళ్లిపోయింది. ఓట్ల కోసం పలు కార్పొరేట్ సంస్థలు నోట్ల కట్టలతో దిగగా, డబ్బు, మద్యం ఏరులైపారుతున్నది. ప్రతిరోజూ మందు, విందుల జాతర నడుస్తున్నది. తమ మద్దతుదారులు గెలుపు కోసం పలు సార్ల సంఘాల నాయకులు పలువురు సెలవులు పెట్టి మరీ నోట్ల పంపకంలో బిజీ అయిపోయారు. అటు సార్ల ఓటుకు రూ.5వేలు పంపిణీ చేస్తుండగా, మరోవైపు ఓ పట్టభధ్రుల అభ్యర్థి ఓటుకు రూ.3వేలు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తుండగా, తనిఖీలు చేసి పట్టుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
జగిత్యాల, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభధ్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు ఈ నెల 27న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలలుగా ఉపాధ్యాయ, పట్టభధ్రుల నియోజకవర్గ అభ్యర్థులు తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు సభలు, సమావేశాలు, ఉదయం, సాయంత్రం వేళల్లో ఓటర్లను కలిసి చేసిన ప్రచారం కాస్త భిన్నమైన రూపు తీసుకున్నది. మేధావులకు సంబంధించిన ఎగువ సభ ఎన్నికలైనా, రాజకీయ పార్టీలు (బీఆర్ఎస్ మినహా) తమ అభ్యర్థులను నిలబెట్టడం, నిలబెట్టిన అభ్యర్థులు సైతం కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో వేలాది కోట్లు సంపాదించిన వారు కావడంతో ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం తీవ్రస్థాయికి చేరుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక పార్టీ అభ్యర్థి కార్పొరేట్ కాలేజ్ యజమాని, తన కళాశాల సిబ్బందితో పాటు, ఇతరులను కలుపుకొని 400 బృందాలను తయారు చేసినట్లుగా తెలుస్తోంది. 400 బృందాలు ఎక్కడిక్కడ పట్టభధ్రులను కలుస్తూ వారికి రూ.3వేల నుంచి రూ.5వేలు పంపిణీ చేయడంతో పాటు, మందు విందులు ఇస్తుండడం సర్వసాధారణమైంది. జగిత్యాల జిల్లాలో శుక్రవారం ఒక ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్లో ఉపాధ్యాయులు, ఉపన్యాసకులకు విందు ఏర్పాటు చేసిన వార్త ఉదయం నుంచే పట్టణంలో చక్కర్లు కొట్టడం మొదలైంది. మరో పార్టీ నిలబెట్టిన పట్టభధ్రుల అభ్యర్థి ఓట్ల కొనుగోలుకు ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థితో కలిసి ముందుకు సాగుతున్నట్లు ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. పట్టభధ్రుల అభ్యర్థి ఓటుకు రూ.3వేలు పంపిణీ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగిన ఒక పార్టీ అభ్యర్థి అయితే ఏకంగా ఓటుకు రూ.5వేలు చెల్లింపులు మొదలుబెట్టిన విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో డబ్బు, మందు, ఇతర సామగ్రి పంపిణీపై దృష్టిపెట్టి, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా చూడడం చాలా సర్వసాధారణమైన విషయం. ఎన్నికల సమయంలో ప్రతి సారి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. మందు సీసాలు, చీరలు, క్రికెట్ బ్యాట్లు, గడియారాలు స్వాధీనం చేసుకున్న వార్తలు చూస్తూనే ఉంటాం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు బాహాటంగా పంపిణీ జరుగుతున్నా, మందు విందులు ఎదురుగానే కనిపిస్తున్నా ఎలాంటి ఇబ్బందులు, రైడింగ్లు లేకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీ, లోక్సభ, ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి బ్యాంకు ఖాతాను చూపించాలి. నిర్దేశిత మొత్తం కంటే అధికంగా వ్యయం చేయరాదు. సభలు, సమావేశాలు, పోస్టర్లు, చివరకు జెండాలకు, స్టిక్కర్లకు సైతం అయ్యే వ్యయాన్ని చూపించాలి. ఎన్నికల సమయంలో ఎవరూ రూ.50వేల కంటే ఎక్కువగా నగదు తరలించరాదు. అంతకు మించి డబ్బు ఉంటే, దానికి సంబంధించిన రసీదులు పూర్తిగా ఉండాలి. అలాగే వస్తువులు ఎక్కువ సంఖ్యలో తరలించడానికి వీలు లేదు. ఒక వ్యక్తి వద్ద మూడు ఫుల్ బాటిల్స్ కంటే అధికంగా ఉండడానికి వీలు లేదు. అలా ఉంటే కేసు అవుతుంది. ఇలా అనేక ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో డబ్బు వ్యయంపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం పోటీ చేసే అభ్యర్థుల నెత్తిన పాలు పోసింది. మద్యం, డబ్బులు ఇష్టారాజ్యంగా, బాహాటంగానే తరలిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు, రెవెన్యూ ఏ విభాగం సైతం తనిఖీలు చేపట్టడం లేదు. యథేచ్ఛగా డబ్బుల రవాణా సాగిపోతూనే ఉంది. మందు విందులు, ఇతర తాయిళాలు తరలించబడుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే పదవితో సమానమైన (ఒకరకంగా చెప్పాలంటే అంత కంటే ఎక్కువ హోదా) ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి వ్యయ పరిమితి నిబంధన లేకపోవడం, డబ్బులు, మద్యం, ఇతర తాయిళాల పంపిణీపై నిఘా లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘పెద్దల సభ ఎన్నికలు. మేధావులు తప్పుడు విధానాలకు పాలుపడరు’ అన్న నమ్మకంతో పూర్వకాలంలో నిబంధనలు రూపొందించి ఉండకపోవచ్చునని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పాటించిన నిబంధనలనే పాటించాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
ఉపాధ్యాయ, పట్టభధ్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బుల పంపిణీ, మందు విందుల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లే కీలక పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించిన ప్రచారం విషయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. విద్యా సంస్థల పనివేళల్లో ప్రచారం జరిగితే ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతో విద్యా సంస్థల్లో ప్రచారం చేయరాదన్న నిబంధనను ఎన్నికల సంఘం తెచ్చింది. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు పెద్ద ఇబ్బంది ఆరంభమైంది. అయితే దీన్ని అధిగమించేందుకు ఉపాధ్యాయులు కొత్త ఎత్తుగడ వేశారు. సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయ నాయకులందరూ తమ అభ్యర్థుల కోసం విధులకు సెలవులు పెట్టారు. సెలవు పెట్టిన రోజులకు వేతనంతో పాటు, అభ్యర్థి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఒక సంఘానికి చెందిన ఇద్దరు కీలక నాయకులకు రెండు కార్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు బాహాటంగానే చెబుతుండడం విశేషం. ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమకు ఉన్న పరిచయాలతో ఓటర్ల జాబితా ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్లి తమ అభ్యర్థి తరఫున నేరుగా డబ్బుల పంపిణీ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన యజమానులు ఎన్నికల బరిలోకి దిగడంతో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బోధకులు పెద్ద మొత్తంలో పట్టభధ్రులను, ఉపాధ్యాయులను, లెక్చరర్లను సమీకరిస్తూ, డబ్బు పంపిణీ, మందు విందులను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, పబ్లికేషన్లు నిర్వహించిన వ్యక్తి సైతం బరిలో నిలబడడంతో గతంలో అతడితో కలిసి పనిచేసిన లెక్చరర్లు, ప్రైవేట్ కాలేజీల యజమానులు ఆయన గెలుపు బాధ్యతను భుజానికి వేసుకొని, పంపిణీలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఎటూ చూసిన, ప్రైవేట్, ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్లే ఈ ఎన్నికల హడావిడిలో కీలక భూమిక పోషిస్తున్నారు.