
Dharmaram | ధర్మారం, మార్చి 29 : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీర్ మహమ్మద్ షేక్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో శనివారం రాత్రి ఎంతో వైభవంగా జరిగిన పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికతో జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ విద్యార్థిలో భాషా, గణిత సామర్థ్యాలను పెంపొందించి విద్యార్థులను చాంపియన్స్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారన్నారు.
పత్తిపాక పాఠశాలలో ఈ విద్యాసంవత్సరంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. ఈ పాఠశాల విద్యార్థుల్లో రెండో తరగతి విద్యార్థి ఏదుల్ల అధ్యంత్ ఇటీవల మండల స్థాయి జూనియర్ విభాగంలో ఇంగ్లీష్ రీడింగ్ ఛాంపియన్ గా విజయం సాధించి జిల్లా స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. అలాగే మండల స్థాయి స్పోర్ట్స్ పోటీలో జిల్లా స్థాయికి ఎంపికైన ఏదుల్ల ప్రజ్వల్ అనే విద్యార్థిని ఆయన అభినందించారు. ఈ విద్యాసంవతర్సరంలో విద్యార్థుల సంఖ్యను 42 నుండి 97 కు పెంచుటకు కృషి చేసిన పాఠశాల హెడ్మాస్టర్ నూతి మల్లయ్య సహచర ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంతో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులను పాఠశాలల్లోనే చేర్పించి పత్తిపాక గ్రామం ఆదర్శంగా నిలచేలా కృషి చేయాలని ముందు ముందు ఇదే తరహాలో పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థుల స్కిట్స్, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనపరచిన విద్యార్థులు, అతిథులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం నూతి మల్లయ్య అధ్యక్షత వహించగా సర్పంచ్ మాందాల శ్రావణి హరీష్, ఉప సర్పంచ్ పూసాల మల్లేశం, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ఏలేటి పద్మ, ఉపాధ్యాయులు గండ్రాతి శ్రీలత, అనుమల్ల శారదా, సిరిపురం సునిల్, సీఆర్పీ పర్సన్స్ ఎదుల్ల ప్రేమ్ సాగర్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.