Manthani | మంథని, ఏప్రిల్ 24:మంథని ఆర్యవైశ్య సంఘం ఎన్నికల వివాదం చిలికి చిలికి గాలివానైంది. ప్రత్యర్థులు హైకోర్టు మెట్లెక్కారు. మంథని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం జరగలేదని సముద్రాల రమేష్ హైకోర్టులో కేసు వేసినట్లు గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళితే ఎలాంటి అర్హత లేని రాష్ట్ర మహాసభ అనుబంధ రిజిస్ట్రేషన్ తప్పుడు భైలా తో ఎన్నికలు నిర్వహించడమే కాకుండా నామినేషన్ ప్రక్రియలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.
తొలుత అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న తన నామినేషన్ను అంగీకరించిన ఎన్నికల అధికారులు ఓటింగ్ సమయంలో ఒత్తిడికి లొంగి నిబంధనలకు విరుద్ధంగా తనను పోటీ నుంచి తప్పించి తన ప్రత్యర్థి అభ్యర్థిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాగా హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయగా పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు, ఎన్నికల అధికారులకు, అధ్యక్షుడుగా ప్రకటించిన ఎల్లంకి వంశీధర్ కు పర్సనల్ గా నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ ఈ కేసును జూన్ 7వ తేదీకి కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్ దారుడు సముద్రాల రమేష్ తెలిపారు.