Provide bills | మల్లాపూర్, జూన్ 9: మన ఊరు-మనబడి పథకంలో భాగంగా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల భవన నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం స్థానిక తహసీల్దార్ రమేష్ కు కాంట్రాక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి సభ్యుడు సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల కోసం త్వరగా పనులు చేసి అన్ని రకాల సౌకర్యాలను పెట్టుబడులు పెట్టి ఏర్పాటు చేశామన్నారు. రెండేళ్లు గడిచిన ఇప్పటికి తమకు ఎలాంటి బిల్లులు రాకపోవడం సరికాదని, దీంతో పనులు చేసిన ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు ఆర్థికంగా అప్పులు చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం త్వరగా బిల్లులు చెల్లించని పక్షాన తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు వేసి నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ మాజీ ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.