ధర్మారం/రామడుగు/బోయినపల్లి, ఆగ స్టు 4: కాళేశ్వర గంగ ఉప్పొంగుతున్నది. లింక్-2లో ఎత్తిపోతలతో దిగువన ఎల్లంపల్లి నుంచి ఎగువన మధ్యమానేరు జలాశయానికి పరవళ్లు తొక్కుతున్నది. ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్లో నాలుగు మోటర్లు (2,3,5,7) నడుస్తున్నా యి. ఒక్కో మోటర్ ద్వారా 3,150 చొప్పున 12,600 క్యూసెక్కులు డెలివరీ సిస్టర్న్ల ద్వారా ఎగిసి పడి నంది రిజర్వాయర్లోకి చేరుతున్నాయి.
ఈ రిజర్వాయర్ 10 గేట్లను ఎత్తడంతో గ్రావిటీ కాల్వ ద్వారా జంట సొరంగాలకు చేరి అక్కడి నుంచి 7, 8 ప్యాకేజీలలోని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్ హౌస్కు తరలి పోతున్నాయి. అక్కడి నుంచి సైతం నాలుగు మోటర్లు (1,3,4,5) ద్వారా 12,600 క్యూ సెక్కులు లిఫ్ట్ చేస్తుండగా, డెలివరీ సిస్టర్న్ల ద్వారా ఎగిసిపడ్డ జలాలు సుమారు 5.7 కిలోమీటర్లు ఉన్న గ్రావిటీ కాలువ ద్వారా ప్రవహించి వరదకాలువలో 99వ కిలోమీటర్ మై లురాయి వద్ద కలుస్తున్నాయి.
అక్కడి నుంచి మధ్య మానేరుకు పరుగెడుతున్నాయి. ఆదివా రం వరకు సుమారు 9.8 టీఎంసీల గోదారి జలాలను మధ్య మానేరుకు తరలించినట్టు ప్రాజెక్టు డీఈఈ రాంప్రదీప్ తెలిపారు. కాగా, ఎత్తిపోతల ద్వారా పెద్దఎత్తున వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో మధ్య మానేరులో నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. పూర్తి నీటి సామర్థ్యం 27.054 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 15.18 టీఎంసీలు ఉంది.