రైతు రుణమాఫీపై స్పష్టత కరువైంది. మాఫీ కాక.. సరైన సమాధానం రాక లక్షలాది మంది అన్నదాతల్లో ఆందోళన కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నదనే విమర్శలు వెల్లవెత్తుతుండగా, రైతులు ఆగమవుతున్నారు. ఇటు బ్యాంకులు, అటు మండల వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణి నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారి వరకు కనిపించిన ప్రతి అధికారికీ దరఖాస్తులు ఇస్తూ దండాలు పెడుతూనే ఉన్నారు. మాఫీ అవుతుందా..? కాదా..? అన్నదానిపై ఏ ఒక్క అధికారి నుంచి స్పష్టత రాక బేజారవుతున్నారు. మాఫీ కాని రైతుల కోసం సర్వే చేస్తామన్న సర్కారు కేవలం రేషన్‌కార్డు సంబంధమైన సమస్యలకు మాత్రమే పరిమితం కావడం, ఇంకా దాదాపు 30 కారణాలతో మాఫీ కాని రైతుల పరిస్థితిపై నేటికీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 9 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)/ శంకరపట్నం: కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడుతల్లో కలిపి ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 2,37,994 మంది రైతులకు 1,788.77 కోట్ల రుణమాఫీ చేసింది. నిజానికి క్షేత్రస్థాయి పరిస్థితులకు, రుణమాఫీ జరిగిన తీరుకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ద్వారా వచ్చిన నీళ్లు, ముఖ్యంగా కాళేశ్వరం జలాలతో 2018 నుంచి 2023 మధ్య వ్యవసాయం పండుగలా సాగింది. సాగుతోపాటు రైతుల సంఖ్య కూడా బాగా పెరిగింది.
ఆ లెక్కన చూస్తే.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 7.50 లక్షల మంది రైతులు ఉండగా.. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య ఐదు లక్షలపైగా ఉన్నట్టు బ్యాంకుల వార్షిక ప్రణాళికను చూస్తే స్పష్టమవుతున్నది. ఆ లెక్కన దాదాపు ఐదు లక్షల మంది రైతుల వరకు రుణమాఫీ జరగాల్సి ఉన్నది. కానీ, ప్రస్తుత రుణమాఫీ చూస్తే 40 నుంచి 50 శాతం మంది రైతులకు కూడా జరగలేదు. ఒక్క కేడీసీసీబీ పరిధిలోనే సుమారు 40 వేల మందికిపైగా రైతులకు రుణమాఫీ వర్తించలేదంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. జాతీయ బ్యాంకుల సంగతి చెప్పనక్కర లేదు. అంతేకాదు, కొన్ని గ్రామాల్లో 40 నుంచి 45 శాతం రుణమాఫీ అయితే.. కొన్ని గ్రామాల్లో 50 శాతం జరిగింది.
కొనసాగుతున్న అస్పష్ట విధానం
రుణమాఫీ కాకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం మరోఎత్తుగడ వేసింది. మాఫీ కాని రైతుల వివరాలు సేకరించేందుకు ఇంటింటా సర్వే చేస్తామని ప్రకటించింది. అందుకోసం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే.. రుణమాఫీ కాని అందరి రైతులకు సంబంధించి సర్వే జరగాలి.
కానీ, ప్రస్తుతం అందుకు భిన్నంగా సర్వే నడుస్తున్నది. కేవలం రేషన్‌కార్డు సంబంధమైన సమస్యల ద్వారా మాఫీ కాని రైతుల వివరాలు మాత్రమే సేకరిస్తూ.. మిగిలిన వారి వివరాలు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ అధికారులకు ప్రభుత్వం పంపిన జాబితా కూడా కేవలం రేషన్‌కార్డు సంబంధ సమస్యలది మాత్రమే ఉన్నది. నిజానికి రుణమాఫీ కాకపోవడానికి 31 కారణాలున్నాయని స్వయంగా రాష్ట్ర వ్యవసాయశాఖ గుర్తించి ఆ వివరాలను గతంలోనే ప్రభుత్వానికి పంపింది. ఆ లెక్కన 31 అంశాలపై క్లారిటీ ఇస్తూ.. ఆ కారణాలతో రుణమాఫీ కాని రైతుల వివరాలను ప్రభుత్వం సేకరించాలి. కానీ, కేవలం రేషన్కార్డువి మాత్రమే సేకరిస్తున్నది.
మిగిలిన 30 కారణాలతో రుణమాఫీ కాని వివరాలను ప్రభుత్వం సేకరించడం లేదు. దీంతో సదరు రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. ప్రధానంగా లక్షలాది మంది రైతులకు నేటికీ మాఫీ ఎందుకు కాలేదో ఏ ఒక్కరూ స్పష్టత ఇవ్వడం లేదు. బ్యాంకుల వద్దకు వెళ్తే.. తాము ప్రభుత్వానికి జాబితా పంపించామని, మాఫీ ఎందుకు కాలేదో తమకు తెలియదని, అది తెలియాలంటే వ్యవసాయ అధికారులను కలువాలని చెబుతున్నారు.
ఇదే విషయంపై వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్తే.. తమ వద్ద జాబితాలో పేర్లు లేవని, మాఫీ ఎందుకు కాలేదో తాము చెప్పలేమంటున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ నిర్వహించే ప్రజావాణి నుంచి మొదలు.. క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారి వరకు దరఖాస్తులు చేస్తూ దండం పెడుతున్నారు. మాఫీ చేయాలని కోరుతున్నారు.
సమీక్షే కరువైంది
లక్షలాది మంది రైతులకు.. రుణమాఫీ జరగలేదని ఆధారాలతో సహా వెల్లడైనా.. దీనిపై ఒక సమీక్ష నిర్వహించి రైతులకు భరోసా ఇవ్వడంలో ఉమ్మడి జిల్లా మంత్రులు విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రుణమాఫీ కోసం ఇప్పటికే చాలా చోట్ల ఆందోళలు, రాస్తారోకోలు జరిగాయి. ఇంకా చాలా చోట్ల నిరసనలు తెలుపుతూ.. బ్యాంకులను ముట్టడిస్తున్నారు. మాఫీ కోసం నేటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా మంత్రులు, ఒకసారి అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించాలి. అసలు రుణమాఫీ ఇంకా ఎంతమందికి కావాల్సి ఉన్నది? ఏ కారణాలతో వాళ్లకు కాలేదు? అందులో మాఫీకి అర్హులు ఎంత మంది ఉన్నారు? లోపాలు బ్యాంకుల వద్ద జరిగాయా..? లేక వ్యవసాయ అధికారుల వద్ద జరిగాయా..? ప్రస్తుతం వస్తున్న దరఖాస్తులను ఎలా పరిగణలోకి తీసుకోవాలి? వాటికి పరిష్కార మార్గాలు ఏమిటీ? అన్న వివరాలు తెలుసుకోవడంతోపాటు ఎప్పటిలోగా మాఫీ చేస్తారో ప్రకటించి.. రైతుల్లో భరోసా నింపాల్సిన అవసరమున్నది. కానీ, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో రైతులకు ఎక్కడా భరోసా దొరక్క అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
నా మాఫీకి ఎవరు బాధ్యత వహిస్తరు?
మాకు ధర్మారం శివార్ల ఎకరంన్నర పొలం ఉంది. మేం మొలంగూర్ బ్యాంకుల 88 వేల లోన్ తీసుకున్నం. రెండో లిస్టుల మా పేరు రాలేదని అడిగితే మూడో లిస్టుల వస్తది అన్నరు. మూడో లిస్టుల గూడా రాలే. బ్యాంకులకు పోయి అడిగితే తర్వాత వస్తది పోన్రి అన్నరు. మళ్లా కొన్ని రోజులకు బ్యాంకుకు పోయి గట్టిగ అడిగితే వ్యవసాయ అధికారులను అడుగుండ్రని చేతులెత్తేసిన్రు. అక్కన్నుంచి వ్యవసాయ అధికార్ల దగ్గరకు పోయి అడిగితే ఇండియన్ బ్యాంకులో లోన్లు తీసుకున్నోళ్ల పేర్లు మా సిస్టంలో చూపిస్తలేదు. మా దగ్గరికి రాకుండ్రి అన్నరు.
పనులు మానుకొని బ్యాంకోళ్లు, వ్యవసాయ అధికార్ల వద్దకు తిరుగుడుకే సరిపోతంది. ఓసారి అందరం కలిసిపోయి గట్టిగ అడిగితే ఆధార్ కార్డుల తప్పై రాకపోయినా, రేషన్ కార్డు లేక రాకపోయినా, అన్ని ప్రభుత్వం క్లియర్ చేస్తదని, అందరు రైతులకు రుణమాఫీ చేస్తమని చెప్పిన్రు. నాకు అన్నీ కరెక్టే ఉన్నయ్. అయినా, ఎందుకు మాఫీ కాదు. మేం వీళ్లు వాళ్ల సుట్టూ తిరుగుకుంట ఎక్కడ సావాలె. అసలు మాకు రుణమాఫీ అయితదా..? కాదా..? దీనికి ఎవరు బాధ్యత వహిస్తరో చెప్పాలె. కొందరికైతే లిస్టుల పేర్లు ఉన్నయి సరే.. పేర్లు ఉన్నోళ్లయి, లేనోళ్లయి అందరివైతే దరఖాస్తులు తీసుకుంటుండ్రు గానీ, మాకు మాఫీ అయినప్పుడే కదా మాలెక్క ఒడిసేది.
– గట్టు శ్రీనివాస్, రైతు (కన్నాపూర్)
లిస్టుల పేర్లు లేనోళ్లకు మాఫీ చేస్తరా లేదా?
మొలంగూర్ ఇండియన్ బ్యాంకు వాళ్లు తింపుకొని తింపుకొని 70 వేలు రుణం ఇచ్చిన్రు. దాంట్ల మేం 2014 నుంచి లోన్ తీసుకుంటున్నం. ఎప్పటికప్పుడు వడ్డీ కట్టి అప్డేట్ చేసుకుంటున్నం. మాకు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదని మేనేజర్‌ను అడిగితే తర్వాత అయితదన్నరు. వ్యవసాయ అధికార్లను అడిగితెనేమో ఇండియన్ బ్యాంకోళ్లు అంటేనే కసురుకున్నరు. గట్టిగ అడిగితే ఏదో ఉప్పోస మాటలు చెప్పవట్టిన్రు. దీంతో రైతులం అందరం ఏకమై ఆందోళన చేసినం. అధికార్లను గట్టిగా నిలదీసినం. ప్రభుత్వం ప్రకటన చేసిందని అన్ని కాగితాలు పట్టుకొని వ్యవసాయ ఆపీసుకు వస్తే ఇప్పుడు వాళ్ల లిస్టులో మా పేర్లే లేవు. మావే కాదు, మా లెక్క వందల మంది పేర్లు లేవట! ఇప్పటికైతే దరఖాస్తులు తీసుకొని సల్లబరుస్తున్నరు. ఇప్పటికి లిస్టుల పేర్లు ఉన్నోైళ్లెతే సరే.. మరి లిస్టుల లేనోళ్ల పేర్లు ఏ యాప్‌ల ఆన్లైన్ చేస్తున్రు. వాళ్లందరికీ మాఫీ చేస్తమని సర్కారు గట్టి హామీ ఇవ్వాలె.
-పిన్‌రెడ్డి సంపత్‌రెడ్డి, రైతు (కన్నాపూర్)