రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల జిల్లా హరిదాస్‌నగర్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టల మధ్య తీర్చిదిద్దిన అర్బన్ ఫారెస్ట్‌కు మోక్షం కరువైంది. హైదరాబాద్ లాంటి నగరాల తరహాలో పెద్ద పార్కులను కొత్త జిల్లాల్లో ఉండాలన్న సంకల్పంతో కేసీఆర్ సర్కారు 60 ఎకరాల స్థలంలో ప్రత్యేక వసతులతో తీర్చిదిద్దగా, ప్రారంభంపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. 3కోట్ల వ్యయంతో పంచవటి, నవగ్రహ నక్షత్ర వనాలు, సైకిల్ ట్రాక్, ట్రెక్కింగ్, యోగా సెంటర్లు ఏర్పాటు చేసి 90శాతం పనులు పూర్తిచేసినా.. తొమ్మిది నెలలుగా తాళం వేసే ఉంచుతున్నది. గత ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందోనని మూసేయగా, ఆ అందమైన బృందావనం కళ తప్పిపోతున్నది. ఇప్పటికైనా ప్రారంభించి, సందర్శకులకు అనుమతించాలని జిల్లా ప్రజానీకం కోరుతున్నది.
సిరిసిల్ల జిల్లా ప్రజల ఆహ్లాదం, ఆనందం కోసం కేసీఆర్ ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్‌కు శ్రీకారం చుట్టింది. అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లాకేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిని ఆనుకొని ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్ గుట్టల్లో 2022 జూన్ 26న పనులు ప్రారంభించింది. 60 ఎకరాలలో 3 కోట్ల వ్యయంతో పనులు చేపట్టింది. ఏడాదిలోగా పూర్తి చేసే లక్ష్యంతో చకచకా పనులు పూర్తి చేసింది. సైకిల్ ట్రాక్, ట్రెక్కింగ్, పంచవటి, నవగ్రహ నక్షత్ర వనాలు, పర్కులేషన్ ట్యాంకులు నిర్మించారు. పచ్చనిచెట్ల మధ్య ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయుర్వేద మొక్కలను ఏర్పాటు చేశారు. పార్కులో గుట్ట కింది బాగాన సేద తీరేందుకు గజిబోను నిర్మించారు. రోడ్డు నుంచి కిలోమీటరు దూరంలో పచ్చని చెట్ల మధ్యన యోగా కేంద్రాన్ని, ఇంటర్నల్ రోడ్లు నిర్మించారు. ప్రవేశ ద్వారం, లోటస్‌పాండ్, చిల్డ్రన్స్ ప్లే గార్డెన్, వివిధ ఆకృతుల్లో కూర్చొనే బెంచీలు, బాత్రూంలు, టాయిలెట్లు, బటర్ ఫ్లై గార్డెన్, ఆల్ఫాబెట్ ఏరియాను పూర్తి చేశారు. పర్కులేషన్ ట్యాంకులు నిర్మించారు. పార్కుకు వచ్చే సందర్శకులకు స్వాగతం పలికేలా అద్భుతమైన ముఖ ద్వారం రూపొందించారు. ఇంకా చిన్నారులు ఆడుకునేందుకు కొన్ని వసతులు కల్పించాల్సి ఉంది.
తొమ్మిది నెలలుగా తాళం
అటవీ శాఖ పర్యవేక్షణలో నిర్వహించే అర్బన్ ఫారెస్ట్ట్ పార్కు నిర్మాణం 90శాతం గతేడాదే పూర్తయింది. అట్టహాసంగా ప్రారంభించకపోయినప్పటికీ కొద్దిరోజులు తెరిచి ఉంచారు. సందర్శకులను అనుమతించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులు వచ్చి పార్కును సందర్శించారు. అయితే ప్రభుత్వం మారడంతో పార్కుకు గ్రహణం పట్టింది. గత ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందనుకున్నారో..? ఏమో! మూసివేశారు. సందర్శకులను అనుమతించడం లేదు. తొమ్మిది నెలలుగా వేసిన తాళం వేసినట్లే ఉంది. నెలలు గడుస్తున్నా తెరవడం లేదు. అధికారులను అడిగితే తమకు తెలియదంటూ దాటవేస్తున్నారు. అందమైన పార్కు ఆలనా పాలనా లేక, సందర్శకులను అనుమతించక పోవడంతో వేసిన రహదారులపై పిచ్చిమొక్కలు మొలిచాయి. యోగ సెంటర్, గజిబోను, పర్కులేషన్ ట్యాంకులు నిరుపయోగమవుతున్నాయి. అధికారులు స్పందించి పార్కును ప్రారంభించి సందర్శకులను అనుమతించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.