మల్లాపూర్, డిసెంబర్ 24 : ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయే తప్ప ఏ రంగం పైనా శ్రద్ధ చూపడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు సినీ హీరో అల్లు అర్జున్ మీద ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని మండిపడ్డారు. మల్లాపూర్‌లో ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) నిధులు 5 లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్, జడ్పీ నిధులు 1.50 లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. 33 మంది లబ్ధిదారులకు 9,74,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతు భరోసా రాక, రుణమాఫీ రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇక్కడ మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బద్దం అంజరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు బండి లింగస్వామి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ కాటిపల్లి ఆదిరెడ్డి, నాయకులు దేవ మల్లయ్య, గౌరు నాగేశ్, ముద్దం శరత్‌గౌడ్, కొమ్ముల జీవన్‌రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, అల్లూరి ఆదిరెడ్డి, మేకల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.