మల్లాపూర్/మారుతీనగర్/కోరుట్ల రూరల్, జనవరి 24 : కోరుట్ల నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం చూపారు. ఆయాచోట్ల సభలకు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్లతో వాగ్వాదానికి దిగారు. కోరుట్ల రూరల్ మండలం పైడిమడుగులో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోగా, ఇరువర్గాల నాయకులు ఘర్షణకు దిగారు. మెట్పల్లి పట్టణంలోని 21వ వార్డుసభకు కాంగ్రెస్ కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావును పిలువాలంటూ లొల్లిలొల్లి చేశారు. మల్లాపూర్ సభలో ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ఫ్లెక్సీ ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ శ్రేణులు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు కలుగజేసుకోని, గొడవకు దిగారు. ఇరువర్గాల మధ్య గంటకు పైగా తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. అయితే ఆయాచోట్ల సభలను చూసిన ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవేం గ్రామ సభలంటూ మండిపడ్డారు. గ్రామ సభలు.. కాంగ్రెస్ పార్టీ సభల్లా ఉన్నాయని ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలో ఉందని ఇష్టంవచ్చినట్లు మాట్లాడడం సరికాదని, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దంటూ మండిపడ్డారు.