మధ్యమానేరు ముంపు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాయాజాలం ప్రదర్శిస్తున్నది. నిర్వాసితులను అన్నిరకాలుగా ఆదుకుంటామని ఎన్నికల ముందు పదే పదే ఊదరగొట్టిన ఆ పార్టీ, ఇప్పుడు మాట మార్చింది. ఇండ్ల నిర్మాణం కోసం నిర్వాసితులందరికీ 5.4 లక్షలు ఇస్తామని చెప్పినా.. ఇప్పుడు అధికారంలోకి రాగానే కేవలం నిర్మించుకోని వారికి మాత్రమే ఇందిరమ్మ స్కీం కింద 5 లక్షలు వర్తింప జేస్తామంటూ తాజాగా జీవో జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ద్వంద్వ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. అప్పుచేసి ఇండ్లు కట్టుకున్న తమకెందుకు ఈ స్కీం వర్తింప చేయరో చెప్పాలని వస్తున్న ప్రశ్నలకు ఇటు నాయకులే కాదు ప్రభుత్వం కూడా దాటవేసే ధోరణికి పాల్పడుతున్నది. మరోవైపు నిర్వాసితులకు పేమెంట్ ఎలా చేస్తారన్న దానిపై జీవోలో స్పష్టత లేకపోవడం సందేహాలకు తావిస్తుండగా, ఏదేమైనా ఈ స్కీం నిర్వాసితులందరికీ వర్తింపచేయాలన్న డిమాండ్ పెరుగుతున్నది. ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడకు వస్తుండగా.. నిర్వాసితుల ఇండ్లకు మంజూరు చేసిన జీవోపై వెల్లువెత్తుతున్న అనుమానాలపై స్పష్టత ఇస్తారా..? లేదా..? అన్నదానిపై ప్రస్తుతంముంపు గ్రామాల్లో చర్చ నడుస్తున్నది.
Mid Manair Dam | కరీంనగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): 2.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంలో భాగంగా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మానేరు వాగుపై 2005-06లో మధ్యమానేరు ప్రాజెక్టుకు పునాది రాయి పడింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. అందులో 9 గ్రామాలు పాక్షికంగా, మరో 9 గ్రామాలు పూర్తిగా మంపునకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం 2009లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఆనాడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చూపుతూ వచ్చింది. 2006 ఫిబ్రవరిలో 406 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలువగా జడ్వీఎస్-రత్నా, సుషి కంపెనీలు జాయింట్ వెంచర్‌గా 16.5 శాతం లెస్తో 339.39 కోట్లకు కాంట్రాక్టు దక్కించుకున్నాయి.
2009 మార్చి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా.. కాంట్రాక్టు సంస్థ మధ్యలోనే చేతెలేత్తేసింది. సదరు సంస్థపై చర్యలు తీసుకొని, ప్రాజెక్టును పూర్తి చేయించాల్సి ఉన్నా కాంగ్రెస్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కేవలం 77 కోట్ల విలువైన పనులు చేసి, ఆ మేరకు బిల్లు తీసుకొని వెళ్లిపోయినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ఫలితంగా 2009 నుంచి ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తిరిగి 2010 ఆగస్టులో 454 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచినా.. తర్వాత సాంకేతిక కారణాలంటూ రద్దు చేశారు. మళ్లీ రెండేళ్ల తర్వాత అంటే 2012లో 454 కోట్ల అంచనాలతో టెండర్లు పిలువగా, 20.05 శాతం లెస్తో 361 కోట్లకు ఐవీఆర్సీఎల్ సంస్థ పనులను దక్కించుకున్నది.
ఆ నాడు పోలీసు పహారా మధ్య భూమిపూజ
ఐవీఆర్సీఎల్ కాంట్రాక్టు సంస్థ దక్కించుకున్న తదుపరి పనులకు భూమిపూజ చేయడానికి ఆనాడు 2012 ఏప్రిల్ 23న భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అప్పటికే మాయమాటలతో విసిగి వేసారిన నిర్వాసితులు వేల సంఖ్యలో తరలివచ్చారు. పరిహారం చెల్లింపులో జాప్యం, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, పరిహారంలో అక్రమాలకు పాల్పడడం, ఇచ్చిన పరిహారం విడుతల వారీగా ఇవ్వడం వంటి అంశాలపై మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను అరగంట పాటు నిలదీశారు. ‘మంత్రి గ్యోబాక్’ అంటూ నినదించారు. ఇంకా ఎంత కాలం మోసం చేస్తారని మండిపడ్డారు. పూర్తి పరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
మంత్రుల రాకకు ముందుగానే ఆగ్రహంతో అక్కడ వేసిన సభా వేదికను కూల్చివేశారు. సమస్యలపై మంత్రులను ప్రశ్నించే సమయంలో నిర్వాసితులను పోలీసులు అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిహారంతోపాటు పునరావాస పథకం కింద తమకు ఎప్పుడు? ఎలా సౌకర్యాలు కల్పిస్తారో.. ఎన్నిరోజుల్లో కల్పిస్తారో చెప్పాకే ఇక్కడి నుంచి వెళ్లాలని అడ్డుకున్నారు. అప్పుడు పోలీసుల పహారా మధ్యనే ఆనాడు మంత్రి సుదర్శన్‌రెడ్డి భూమి పూజ చేశారు. నిర్వాసితుల ఆగ్రహాన్ని గుర్తించిన మంత్రి నేరుగా రంగంలోకి దిగి, బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మొదటి దశ కింద ప్రాజెక్టులో ముంపునకు గురైన చీర్లవంచ, శాభాష్‌పల్లి, నీలోజుపల్లె, కొదురుపాక గ్రామాల నిర్వాసితులకు రెండు నెలల్లో అంటే 2012 జూన్‌లోగా అన్ని రకాల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పరిహారం చెల్లింపు కోసం ప్రత్యేకాధికారులను నియమిస్తామన్నారు.
దశలవారీగా.. వీలైనంత తొందరగా మిగిలిన ముంపు గ్రామాలకు పరిహారం చెల్లిస్తామని, రానున్న రెండున్నర ఏళ్లలో కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, శాభాష్పల్లె వద్ద బ్రిడ్జి నిర్మిస్తామని, వరదకాలువపై క్రాస్రెగ్యులెటర్స్ నిర్మిస్తామని, నిర్వాసితుల డిమాండ్లను పరిష్కారిస్తామని హామీలు గుప్పించి వెళ్లిపోయిన తర్వాత పట్టించుకున్న వారే లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్వాసితులను నిలువెల్లా మోసం చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. అలాగే పెడింగ్‌లో ఉన్న మెజార్టీ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్లింది.
ఇప్పుడు మరో మాయాజాలం?
తాము అధికారంలోకి రాగానే ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని, అలాగే నిర్వాసితులందరికీ ఇండ్ల నిర్మాణం కోసం 5.4 లక్షల చొప్పున డబ్బులు ఇస్తామని, ఇవే కాకుండా పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ.. గత ఎన్నికల సమయంలో అగ్ర నాయకుల నుంచి మొదలు ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వరకు ఊదరగొట్టే మాటలు చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా.. నిన్నామొన్నటి వరకు ముంపు గ్రామాల సమస్యల పరిష్కరానికి ఒక్క చర్య తీసుకోలేదు. కనీసం వారిని పిలిచి మాట్లాడలేదు. కాగా, ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడ పర్యటన నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలు అడ్డుకుంటారన్న సమాచారంతో హడావుడిగా జీవో విడుదల చేశారు. మధ్యమానేరు రిజర్వాయర్‌లో మొత్తం 10,683 నిర్వాసిత కుటుంబాలున్నాయని, అందులో 5,987 మంది లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకున్నారని, ఇంకా 4,696 మందికి సొంత ఇండ్లు లేవని, వీరికి మంజూరు చేయాలంటూ వచ్చిన అభ్యర్థన మేరకు.. ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర రిజర్వ్ కోటా కింద 5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు పేర్కొంటూ ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 42ను ఈనెల 16న విడుదల చేసింది. ఇది కాంగ్రెస్ మరో మాయాజాలం అన్న విమర్శలే వస్తున్నాయి.
ఎన్నెన్నో అనుమానాలు
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోపై ఎన్నో అనుమానాలు తలెత్తుతుండగా, బాధితుల నుంచి అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సొంత ఇండ్లు నిర్మించుకోని వారికే ఈ స్కీం వర్తింపజేయడం ఏంటని, గూడుచెదరి గుండెపగిలి.. అప్పులు చేసి సొంతిండ్లు నిర్మించుకున్న వారికి ఈ ప్యాకేజీ ఎందుకు వర్తింప చేయరన్న డిమాండ్ ప్రస్తుతం ముంపు గ్రామాల్లో వ్యక్తమవుతున్నది. బాధితులెవరైనా ముంపువాసులే కదా? అలాంటప్పుడు ఈ పక్షపాతం ఎందుకన్న చర్చ నడుస్తున్నది. మొత్తం 10,683 మంది నిర్వాసిత కుటుంబాలకు జీవోఎంఎస్ నంబర్ 42ను వర్తింప చేయాలని, దీనిపై ఈ నెల 20న ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే డబ్బుల చెల్లింపులోనూ అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం నిర్వాసితులు ఇండ్లు నిర్మించుకునేందుకు ఇస్తామంటున్న 5 లక్షలను ఎలా పేమెంట్ చేస్తారన్న దానిపై జీవోలో స్పష్టత లేదు. కొన్ని మిహాయింపులు వర్తింప చేస్తామని చెప్పారే తప్ప అవి ఎలాంటివన్నదానిపై వివరాలు లేవు. అంతేకాదు, ఈ డబ్బులు ఒకేసారి చెల్లిస్తారా? లేక మూడు నాలుగు స్టేజీల్లో ఇస్తారా? అన్న విషయంపైనా అస్పష్టత ఉన్నది. నిజానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ పథకం కింద ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు గతంలో ప్రకటించింది. ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తున్నది. వీటికి ప్రస్తుతం నిర్వాసితులకు ఇస్తున్న ఇండ్లకు ఏమైనా లింకు పెడుతారా? లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరమున్నది.
అలాగే ఇప్పటికే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని, ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేయడమే కష్టమవుతున్నదని సర్కారే స్వయంగా చెబుతున్నది. ఈ పరిస్థితుల్లో జీవోఎంఎస్ నంబర్ 42 ప్రకారం ఎవరైనా నిర్వాసితులు ఇండ్ల నిర్మాణం మొదలు పెడితే, మధ్యలో నిధులు లేక బిల్లులు రాకపోతే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే నిర్వాసితుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తేనే నమ్మకం ఏర్పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం వేములవాడకు వస్తున్న సీఎం చాలా అంశాలపై స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్ వస్తున్నది. ప్రధానంగా జీవోఎంఎస్ 42ను నిర్వాసితులందరికీ వర్తింప జేస్తారా? లేదా? చెల్లింపులు ఎలా చేస్తారు? సొంతిల్లు లేదని చెబుతున్న 4,696 మందికి మించి ఎవరైనా ఉంటే ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి? జాబితాలో ఏమైనా తప్పులు దొర్లితే బాధితులు అనుసరించాల్సిన మార్గాలు ఏమిటి? ముంపు గ్రామాల్లో ఉన్న పెడింగ్ సమస్యలకు పరిష్కారం ఎలా చూపుతారు? అలాగే ఉపాధి కల్పనకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అన్న దానిపై ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలనే డిమాండ్ ప్రస్తుతం నిర్వాసిత గ్రామాల్లో వ్యక్తమవుతున్నది.
ప్రతి నిర్వాసితుడికీ 5.04 లక్షలు ఇవ్వాలి
వేములవాడ రూరల్, నవంబర్ 18 : మిడ్‌మానేరు ప్రాజెక్టులో ముంపునకు గురైన నిర్వాసితులందరికీ 5.04 లక్షలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. వేములవాడ మండలం అనుపురంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పీసీసీ హోదాలో రేవంత్‌రెడ్డి రుద్రవరంలో బస చేశారని, ఇప్పుడు సీఎం హోదాలో వేములవాడకు వస్తున్నందున, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. ఆయన చెప్పిన విధంగా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం ఇచ్చిన 4,696 ఇండ్ల నిర్మాణానికి తోడు ఇండ్లు కట్టుకున్నవారికి సైతం డబ్బులు ఇవ్వాలని కోరారు. అలాగే, ఇళ్లు, భూ పరిహారం, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, మాజీ ఎంపీపీ బూర వజ్రమ్మబాబు, మాజీ సర్పంచ్ కొండపల్లి వెంకటరమణరావు, జక్కుల నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, రెడ్డవేణి పర్శరాములు, వనపట్ల సందీప్‌రెడ్డి, అభిమన్యు, భూమల్ల లక్ష్మన్, నరిహాంరెడ్డి, నరేశ్, శ్రీధర్, మల్లేశం, తిరుపతి, శ్రీనివాస్, కనకరాజ్, నిరంజన్ పాల్గొన్నారు.
నిర్వాసితులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లో మిడ్ మానేరు సమస్యలను పరిష్కరిస్తామని, ప్రతి ఇంటికీ 5.4 లక్షలు ఇస్తామని, యువతీ యువకులకు ప్యాకేజీ ఇస్తామని, ఇండ్ల సమస్యలు పరిష్కరిస్తామని, భూములు కోల్పోయిన వారికి జీవనోపాధి కల్పిస్తామని రేవంత్‌రెడ్డి గతంలో అనేక సభలు, సందర్భాల్లో పదే పదే చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క సమస్యా పరిష్కరించలేదు. కాంగ్రెస్ మాటలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. కానీ, ఇప్పుడు మాత్రం మాట మార్చి కొంత మందికే ఇండ్ల నిర్మాణం కోసం పైసలు ఇస్తామని చెప్పడం అన్యాయం. తాజాగా ఇచ్చిన జీవోను మొత్తం నిర్వాసిత కుటుంబాలకు వర్తింపచేయాలి. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే ముందే ఈ ప్రకటన చేయాలి. లేదంటే నిర్వాసితుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. అంతేకాకుండా, ఇందిరమ్మ ఇండ్లతో లింకు పెట్టకుండా చీఫ్ మినిస్టర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద నిధులు కేటాయించి ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి.
– జక్కుల నాగరాజు, ముంపు బాధితుడు, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు
నిర్వాసితులందరికీ ఇవ్వాలి
ఇండ్ల నిర్మాణంతో సంబంధం లేకుండా నిర్వాసితులందరికీ 5.04 లక్షలు ఇవ్వాలి. ఇండ్లు కట్టుకోని వారికి మాత్రమే ఇస్తామంటే ఎలా? మేం అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నం. ప్రభుత్వం మమ్మల్ని కూడా పట్టించుకోవాలి. మాకు కూడా డబ్బులు ఇవ్వాలి. మా ఇండ్లను చూసి మాకు బాధలు లేవంటే ఎలా? ఉన్నదంతా ఇండ్ల కోసమే ఖర్చు చేసినం. ఇప్పుడు ఉపాధి లేదు, డబ్బులు లేవు. నిర్వాసితులందరినీ ఒకే రకంగా చూడాలి.
– వనపట్ట సందీప్‌రెడ్డి, అనుపురం
ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా ప్రతి నిర్వాసితుడికీ 5.04 లక్షలు ఇవ్వాలి. ఇల్లు కట్టుకోని వారికి 5 లక్షలు ఇస్తామంటున్నరు. కానీ, మేం అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నం. మా సంగంతి ఏంటి? ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇచ్చిన హామీ మేరకు మా అందరికీ 5.04 లక్షలు ఇవ్వాలి. ముంపు గ్రామాల నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయాలి. మేం కొత్తగా అడిగేది ఏమిలేదు. మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. అందరికీ వచ్చేలా జీవో తీసుకురావాలి.
– జింక శ్రీధర్, అనుపురం