కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర అధ్యక్ష పదవుల కోసం గురువారం చేపట్టిన అభిప్రాయ సేకరణ రచ్చరచ్చయింది. అసలు ఏ స్థాయి నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఏకంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయ గేట్లకు తాళాలు వేసి అభిప్రాయాలు తీసుకోవడంపై నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, కొందరు నాయకులను మాత్రమే పిలిచి అభిప్రాయాలు తీసుకోగా, మిగతా వారు తాము కాంగ్రెస్ నాయకులం కాదా..? అంటూ వాదనకు దిగారు.
మరోవైపు ఆయా పదవుల కోసం పోటీపడుతున్న నాయకుల్లో కొందరిని లోపలికి రానిచ్చి తమనెందుకు రానివ్వరంటూ గేట్లు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన అభిప్రాయ సేకరణ రాత్రి వరకూ కొలిక్కిరాకపోగా.. ఏఐసీసీ పరిశీలకులు అర్ధాంతరంగా వెళ్లిపోవాల్సి వచ్చింది. మొత్తంగా హస్తం పార్టీలో వర్గపోరు ఒక్కసారిగా బయట పడడంతో కీలక నాయకులు సైతం తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది.
కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 16 : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కమిటీ అధ్యక్ష పదవుల కోసం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నుంచే అభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పినా.. సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించారు. అయితే, ఏఐఐసీ పరిశీలకుడి ముందు.. తమ బలాన్ని నిరూపించుకోడానికి పోటీ పడుతున్న అభ్యర్థులు.. పెద్ద సంఖ్యలో ఆటోలను పెట్టి మరీ నాయకులను, కార్యకర్తలను తరలించారు. అయితే, తమ బలం నిరూపించుకోవడానికి కొంత మంది పోటీదారులు పార్టీకి సంబంధం లేని వారిని తీసుకొచ్చారని పలువురు నాయకులు ఆరోపించారు. దీంతో పరిశీలకులు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అందరి నుంచి అభిప్రాయం సేకరించడం సాధ్యం కాదని, అందుకే ముందుగా జిల్లా కమిటీ నేతలు, మండల, బ్లాక్ కాంగ్రెస్, గ్రామ, డివిజన్ కమిటీల అధ్యక్ష, కార్యదర్శుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ మానే, పీసీసీ పరిశీలకులు ఆత్రం సుగుణ, సత్యనారాయణ తెలిపారు.
దీంతో తమ అభిప్రాయాలు ఎందుకు తీసుకోరంటూ పలువురు నాయకులు వాదనకు దిగడంతో.. అందరి అభిప్రాయాలు పేపర్లో రాసి ఇవ్వాలని సూచించారు. అందుకోసం పేపర్లు పంపిణీ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఈ విషయాన్ని గమనించిన పరిశీలకులు, అక్కడి నుంచి లేచి పక్కనే ఉన్న డీసీసీ కార్యాలయంలోకి వెళ్లారు. వివాదం ముదురుతుందని భావించి కార్యాలయ గేట్లకు తాళం వేయించి.. ఆయా మండల, డివిజన్, బ్లాక్ కమిటీ నాయకులను పిలిచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. దీంతో మిగిలిన నాయకులు, కార్యకర్తలు పరిశీలకుల తీరుపై మండిపడ్డారు. కొంత మంది అభిప్రాయాలు మాత్రమే తీసుకోవడం ఏంటని ఆగ్రహించారు. ఒక దశలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అసలు ఏ స్థాయి నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారో తెలియని గందరగోళం నెలకొన్నది.
అభిప్రాయ సేకరణ సరిగా జరగడం లేదని పోటీదారుల్లో కొంత మందిని లోపల ఉంచుకొని.. మరికొంత మందిని బయటకు పంపడం ఏంటని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు వర్గీయులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పరిశీలకుల ఆదేశాల మేరకు వెలిచాల రాజేందర్రావు కార్యాలయం బయట ఉన్నప్పుడు, పోటీలో ఉన్న మిగిలిన సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, సీనియర్ నాయకుడు అంజన్‌కుమార్ కార్యాలయంలో ఎలా ఉంటారని నిలదీశారు. వాళ్లు లోపల ఉన్నప్పుడు వెలిచాల రాజేందర్రావును ఎందుకు లోనికి రాకుండా అడ్డు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలోనే ఆగ్రహానికి గురైన రాజేందర్రావు వర్గీయులు గేట్లను బద్దలు కొట్టేందుకు యత్నించారు.
అక్కడితో ఆగకుండా.. కార్యాలయంలో ఉన్న దొంగలు బయటకు రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్‌లోని వివిధ వర్గీయ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్నది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పీసీసీ పరిశీలకురాలు ఆత్రం సుగుణ బయటకు వచ్చి, వెలిచాల రాజేందర్‌రావుతోపాటు మరో ఐదుగురిని లోపలికి అనుమతిస్తామని చెప్పారు. దీనిపై తనను లోపలికి పిలువనందుకు ఆందోళన చేయడం లేదని, తాను పార్టీ నిబంధనల ప్రకారం లోపలికి రానని, కానీ లోపలున్న పోటీదారులను ముందుగా బయటకు పంపాలని రాజేందర్రావు డిమాండ్ చేశారు. దీంతో పోటీదారులుగా భావిస్తున్న సదరు నాయకులను బయటకు పంపారు. కొంత మంది నుంచి అభిప్రాయాలు సేకరించడం మాత్రమే కాదని, బయట భారీగా చాలా మంది సీనియర్ నాయకులతోపాటు మాజీ ప్రజాప్రతినిధులున్నారని, వారి నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవాలని రాజేందర్రావు డిమాండ్ చేశారు.
అభిప్రాయ సేకరణ చేపడుతున్న గది వద్దకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ నుంచి అభిప్రాయాలు తీసుకోవాలంటూ ఒక్కసారిగా తలుపులను తోసివేసే ప్రయత్నం చేశారు. తలుపులు పాక్షికంగా దెబ్బతినగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ మానే అభిప్రాయ సేకరణను మధ్యలోనే నిలిపివేశారు. పేపర్ మీద అభిప్రాయాలు రాసివ్వాలని సూచించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరిశీలకులు తమ వాహనంలో వెళ్తున్న క్రమంలో కూడా పలువురు నాయకులు ప్రశ్నించారు. ఏళ్ల తరబడిగా తాము పార్టీని పట్టుకొని ఉన్నామని, తమ అభిప్రాయాలను తీసుకోకపోవడం ఏంటని నిలదీసే ప్రయత్నం చేశారు. వారి మాటలు వింటూనే ఏఐసీసీ పరిశీలకులు జారుకున్న తీరు పార్టీలో హాట్‌టాపిక్‌లా మారింది. మొత్తానికి కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల పరిశీలన కాస్త రచ్చ రచ్చగా మారింది.