KARIMNAGAR | చిగురుమామిడి, ఏప్రిల్ 2 : బిసి,ఎస్సీ, ఎస్టీ, మహిళా సమాజానికి హక్కులు రాకుండా అడ్డుపడ్డ గాంధీని ఏ విధంగా జై బాపు అని అనాలని, కాంగ్రెస్ ప్రభుత్వం జై బాబు, జై భీమ్, జై రాజ్యాంగం నినాదాలతో వస్తున్న పాదయాత్రను ప్రజలు బహిష్కరించాలని ధర్మ సమాజ పార్టీ (డీఎస్పీ) జిల్లా అధ్యక్షుడు తాళ్ల నరేష్ కోరారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జై భీమ్, జై భారత రాజ్యాంగం అనే నినాదాన్ని పలికే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై భీమ్, జై బాబు, జై రాజ్యాంగం అనే నినాదాలను ప్రజలకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో గ్రామాల్లో చేస్తున్న పాదయాత్రను ప్రజలు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
బీసీ, దళిత, ఆదివాసి, గిరిజన వాదాల పట్ల వస్తున్న ఉద్యమాలను అణిచి వేయడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా పాదయాత్ర చేస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పాదయాత్రను తిప్పుకొట్టాలని ప్రజలను కోరారు. ధర్మసమాజ పార్టీ పక్షాన అంబేద్కర్, ఫూలే, కాన్షిరాం సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని నరేష్ తెలిపారు.