రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సన్నవడ్లకు బోనస్ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. రెండేళ్లుగా యాసంగి సీజన్లో జమ చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో 2024-25 యాసంగిలో రూ.16.67 కోట్లు, ఈ యాసంగి సీజన్లో మరో రూ.3.09 కోట్ల బోనస్ అందించాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్ల సమయంలోనే ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్లుగా ఇవ్వకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. అంతే కాకుండా, సన్నాలకు బోనస్ ఎగవేసే ప్రయత్నంలో ఉన్నదని ఆరోపిస్తున్నారు. గతంలో 33 రకాల సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిందని, ఇప్పుడు కేవలం 7 రకాలకే ఇస్తామని ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. సన్నరకాల సాగును ప్రోత్సహించేందుకు ప్రతి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని వాగ్దానం చేసింది. దీంతో రైతులు సన్నాల సాగుకు ఎక్కువగా మొగ్గు చూపారు. పెట్టుబడి భారం పెరిగినా, తెగుళ్ల బెడద ఎదురైనా తట్టుకుని చాలా మంది సన్నాలు సాగు చేశారు. కానీ, సర్కారు ఇచ్చిన హామీని మర్చిపోవడంతో రైతులకు నిరాశే ఎదురైంది.
ఏ ఒక్క సీజన్‌కు కూడా బోనస్ సరిగ్గా అందించిన పాపాన పోలేదు. ధాన్యం కొనుగోళ్లు చేసినప్పుడే కనీస మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఖాతాల్లో జమ చేస్తామని చెప్పినా ఇచ్చిన మాటపై నిలబడ లేదు. ఇప్పటి వరకు రెండు సీజన్లకు సంబంధించిన బోనస్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నది. గత యాసంగిలో సేకరించిన సన్నరకం ధాన్యంపై ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు. ఈ క్రమంలో రైతులు సన్నాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. 2024-25 యాసంగి సీజన్‌కు ఈసారి సీజన్‌కు సన్నాలు గణనీయంగా తగ్గడమే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
కరీంనగర్ జిల్లాలో రెండు సీజన్లకు కలిపి రైతులకు రూ.19.76 కోట్లకుపైగా బోనస్ రావాల్సి ఉంది. 2024-25లో జిల్లాకు చెందిన రైతులు 33,342 మెట్రిక్ టన్నుల సన్నరకాలను విక్రయిస్తే కనీస మద్దతు ధర కింద క్వింటాలుకు రూ.2,320 చెల్లించారు. ఒక్కో క్వింటాలుకు రూ.500 చొప్పున రూ.16.67 కోట్ల బోనస్ రావాల్సి ఉంది. బోనస్ చెల్లింపులో ప్రభుత్వ జాప్యం కారణంగా రైతుల్లో ఆసక్తి తగ్గి పోయింది. ఈసారి సాగు చేసిన చాలా మంది రైతులు మిల్లర్లకు అగ్గువ ధరకు అమ్ముకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కేవలం 6,177 మెట్రిక్ టన్నులు మాత్రమే విక్రయించారు. కనీస మద్దతు ధర రూ.2,389 చెల్లించారు. ఈ సీజన్‌కు సంబంధించి రూ.3.09 కోట్ల బోనస్‌ను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ, పోయినేడాది యాసంగి సీజన్ బోనసే రాలేదని, ఇంకా ఈ సీజన్ ఏం ఇస్తుందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు మాటలు నమ్మి సాగు చేస్తే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు.
దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం చెబుతున్న నేపథ్యంలో కనీసం సన్నరకాలు సాగు చేద్దామనుకునే రైతులకు రాష్ట్ర సర్కారు మొండితనం శరాఘాతంగా మారింది. ఇప్పటికే బోనస్ ఇవ్వకుండా వంచిస్తున్న ప్రభుత్వం సన్న రకాలను కుదిస్తూ మరో నిర్ణయం తీసుకున్నది. గతంలో 33 రకాల సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పినా.. ఇప్పుడు కేవలం 7 రకాలకు మాత్రమే కుదించింది. అందులో బీపీటీ 5204, ఆర్ఎస్ఆర్-15048, కేఎన్ఎం-1638, జైశ్రీరాం, హెచ్ఎంటీ సోనా, వరంగల్-44, కేఎన్ఎం-7715 రకాలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఇతర విత్తనాలు కొనుగోలు చేసి పెట్టుకున్న తమ పరిస్థితి ఏంటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మాదిరిగానే అన్ని రకాల సన్నాల సాగును ప్రోత్సహించాలని, బోనస్ బకాయిలు త్వరగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.