గొల్లపల్లి, జూన్ 20 : గొల్లపల్లి మండలానికి సాగునీరందించే ఎస్సారెస్పీ డిస్ట్రీబ్యూటరీ-64 కాలువతోపాటు తూములు, మైనర్ కాలువలు అధ్వానంగా మారాయి. వేసవిలో ఈ కాలువను శుభ్రం చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో చెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కాలువలు శుభ్రం చేసే పనుల మంజూరు కోసం ఎస్టిమేట్ చేసి ఎంపీడీవో ద్వారా కలెక్టర్కు పంపించామని అధికారులు చెబుతున్నారు. అయితే వానకాలం మొదలైందని, వర్షాలు పడుతున్నాయని, ఇప్పుడు ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు.
కాకతీయ ప్రధాన కాల్వకు జగిత్యాల సమీపంలోని నర్సింగాపూర్ వద్ద ప్రారంభమయ్యే డీ-64 కాలువ, అక్కడి నుంచి 27 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్నది. ఒక్క గొల్లపల్లి మండలంలో 12 వేల పైచిలుకు భూమి ఈ కాలువ కింద సాగవుతుంది. ఈ కాలువకు 14 మైనర్ కాలువలు ఉండగా, అవి కూడా శిథిలమై, వాటికి షెటర్లు లేక నీరు వృథాగా పోతున్నది. మరోవైపు రైతులు ఎక్కువ నీటిని వాడుకునేందుకు కాలువలో పెద్దపెద్ద రాళ్లు అడ్డంగా పెట్టి అడ్డు కట్టలు కడుతుంటారు. దీనిపై అధికారుల పర్యవేక్షణ లేకపోగా, కనీసం లస్కర్లు సైతం లేక పోవడంతో ఆయకట్టు చివరి రైతులకు కన్నీరే మిగుతున్నది.
డీ-64కు డిజైన్ డిశ్చార్జీ ప్రకారం 230 క్యూసెక్కుల నీరు విడుదలైతే ఈ కాల్వ పరిధిలో 14,226 ఎకరాలకు సజావుగా నీరందాలి. కానీ, మైనర్ కాలువల షెటర్లు, తూములకు ఉన్న పైపులు సరిగా లేక నీరు వృథా అవుతున్నది. ఈ సీజన్లో ఆయకట్టు చివరి వరకు నీరందాలంటే కాల్వల్లో పేరుకు పోయిన పిచ్చి చెట్లు, చెత్తా చెదారాన్ని జేసీబీల సహాయంతో తీయించి ఆయకట్టు చివరి వరకు నీరందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.