BC Reservations | రుద్రంగి, అక్టోబర్ 11: బలహీన వర్గాలకు చెందిన బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ పేరుతో మోసం చేస్తుందని, బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుందని సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి అన్నారు. బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో బీసీ రిజర్వేషన్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు ఓటమి తప్పదని తెలిసే చట్ట బద్దత లేని జీవోని విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తుందన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గతంలో బీసీ బంధు, అనేక పథకాల ద్వారా లబ్ధి పొందిన కాంగ్రెస్ నాయకులు నేడు కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరుతో అడ్డగోలు హామి ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్న వాటిని నిలబెట్టుకోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతుందన్నారు.
బీసీలకు ఉన్న చట్టాలను సవరించకుండానే ఎన్నికల కోసం 12 శాతం రిజర్వేషన్ జీవో తీసుకువచ్చి కోర్టులో కేసు ఉన్నప్పటికీ నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసి ప్రజలను, ప్రజాప్రతినిధులను ఆయోమయానికి గురి చేసి కోట్ల రూపాయలను ప్రజా ధనాన్ని వృథా చేశారన్నారు. చట్ట బద్దత లేని జీవోని విడుదల చేసి కేసీఆరు, బీఆర్ఎస్ ను సాకు చెప్పడం సిగ్గుచేటన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చట్టసవరణ చేసి గవర్నర్ వద్ద ఉన్న బిల్లును పాస్ చేయించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ పెట్టి ముందుకు వెళ్లాలన్నారు.
ప్రజలకు న్యాయం చేయకుండా ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ ఉపన్యాసాలు చేస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, నాయకులు గంగం మహేష్, మంచె రాజేశం, కంటె రెడ్డి, మాడిశెట్టి ఆనందం, కర్ణవత్తుల దేవేందర్, దుబ్బ రవి, ఉప్పులూటి గణేష్, గొళ్లెం నర్సింగ్, పెద్దులు, గంగాధర్, సుదర్శన్, కొండయ్య, నర్సయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.