మెట్పల్లి టౌన్, మే 29: అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి, మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పాలనలో ఫెయిల్ అయిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తీవ్రంగా విమర్శించారు. గురువారం మెట్పల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన పాలన గురించి ప్రజలకు వివరించాలన్నారు. స్వలాభాల కోసం పార్టీలు మారే వారిని ఉపేక్షించేది లేదని, మళ్లీ వారిని పార్టీలోకి తీసుకునేది లేదని తేల్చిచెప్పారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు.
ప్రజలు మళ్లీ బీఆర్ఎస్నే కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారని వివరించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పే ర్కొంటూనే, పలు సూచనలు చేశారు. ఇక్కడ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రావు, మాజీ కౌన్సిలర్లు, మన్నేఖాన్, కిషోర్, గంగాధర్, నాయకులు ఓజ్జెల శ్రీనివాస్, ఎనుగుందుల శ్రీనివాస్‌గౌడ్, ఉజగిరి శ్రీనివాస్, భీనాతి సత్యం, జక్కం బాబు, గజం రవి, బర్ల రమేశ్, సొమిడి రఘు, తేజ, ప్రవీణ్ పాల్గొన్నారు.