జమ్మికుంట, జనవరి 5: హైదరాబాద్ కేంద్రంగా జమ్మికుంట మున్సిపల్ పాలకవర్గం క్యాంపు రాజకీయాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పెద్దల ఎత్తులకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు కదుపుతున్న పావులు సర్వత్రా టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. వారం రోజుల నుంచి రెండు వర్గాల పాలకవర్గ సభ్యుల క్యాంపులు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. గత నెల 29న 23వ వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య అవిశ్వాసానికి తెరతీయగా, మరుసటి రోజు 23 మంది సభ్యులతో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు అవిశ్వాసానికి వ్యతిరేకంగా కలెక్టర్‌కు కాపీని అందించారు.
దీంతో ఇరు వర్గాలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి. ప్రస్తుతం ఇరు వర్గాలకు చెరో 15 మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫిషియోగా ఎమ్మెల్యే మద్దతు కీలకం కానుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవల సభ్యుడిగా నమోదు కోసం కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. నమోదు ఆలస్యమవుతుండడంతో చైర్మన్ వర్గం వేగంగా పావులు కదిపింది. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, పాలకవర్గం శుక్రవారం సాధారణ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సమావేశంలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యేకు ఆమోదం తెలిపి, ప్రమాణ స్వీకారం చేయించేందుకు చైర్మన్ వర్గం క్యాంపు నుంచి జమ్మికుంటకు బయల్దేరారు.
దీంతో ఒక్కసారిగా జమ్మికుంటలో వాతావరణం వేడెక్కింది. క్యాంపులో ఉన్న ఇరు వర్గాలకు చెందిన అభిమానులు మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. అలాగే చైర్మన్, మల్లయ్య వర్గాలిద్దరూ సమావేశానికి హాజరవుతుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణ సీఐ రమేశ్, ఎస్ఐలు శ్రీధర్, రాజేశ్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు చేపట్టారు. ఉదయం 10గంటలకు సమావేశం జరగాల్సి ఉండగా.. మధ్యాహ్నం 2గంటల వరకు దాదాపు 5గంటల సేపు ఏం జరుగుతుందో..? అని ఉత్కంఠ రేపింది. అయితే కౌన్సిల్ సభ్యుడిగా ఎమ్మెల్యేకు, కలెక్టర్ ఆమోదం తెలిపినట్లు చైర్మన్ వర్గానికి సమాచారం రావడంతో మున్సిపల్ సమావేశం రద్దు అయింది. చైర్మన్ వర్గం మళ్లీ హైదరాబాద్ క్యాంపునకు తరలివెళ్లింది. దీంతో అన్ని వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
30 మంది కౌన్సిల్ సభ్యులున్న జమ్మికుంట మున్సిపల్లో చైర్మన్ రాజేశ్వర్‌రావుకు 29 మంది సభ్యుల మద్దతు ఉండేది. 23వ వార్డు కౌన్సిలర్ మల్లయ్య కాంగ్రెస్‌లో చేరడంతో పాటు తనకు పలువురు సభ్యుల మద్దతు ఉందని డీఆర్వోకు అవిశ్వాస తీర్మాన పత్రం అందించాడు. బీఆర్ఎస్ విప్ జారీ చేస్తామనడంతో పాటు 23 మంది కౌన్సిలర్ల మద్దతు తమకే ఉందని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, కలెక్టర్‌కు తీర్మాన పత్రం ఇచ్చారు. దీంతో ఇద్దరికీ సమానంగా సభ్యుల మద్దతుందని తెలుస్తోంది. ఎక్స్ అఫిషియో సభ్యుడి మద్దతుతో చైర్మన్‌కు 16 మంది సభ్యులున్నారు. అవిశ్వాస బల ప్రదర్శన ఈ నెల 25న జరుగనున్నదని, కలెక్టర్ నోటీసులు సైతం జారీ చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. వందశాతం తామే గెలుస్తామని, గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. కాగా అవిశ్వాస రగడ సద్దుమణగాలంటే మరో 20 రోజులు ఆగాల్సిందే.