Sunke Ravi Shankar | కార్పొరేషన్, జూన్ 24 : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేసినందుకా కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకునేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు బేడీలు వేసి అరెస్టు చేసినందుకా కాంగ్రెస్ సంబురాలు అని ప్రశ్నించారు. మూడు విడతల రైతుబంధును ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగో విడత అరకొరగా రైతు భరోసా ఇస్తుందని ఆరోపించారు.
ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా కూడా రైతు భరోసా అమలు మండిపడ్డారు. ఏడాదికి మూడు విడతలు రైతుబంధు ఇవ్వాలని కేసీఆర్ ను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ ఏటా రెండు విడుతలుగా రైతుబంధు అందించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత మూడు విడతల్లో అరకొరగా నిధులు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రైతు రుణమాఫీ కూడా అంతంత మాత్రంగానే చేసి చేతులు దులుపుకుందని మండ్డిపడ్డారు.
ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా కూడా ఎంతమందికి ఇస్తున్నారో ఎవరికి ఇస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని ఆరోపించారు. సాగుకు యోగ్యమైన ప్రతీ ఎకరాకు రైతు భరోసా అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్ని ఎకరాలకు అందించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కవులు, రైతులు, ఉపాధి కూలీలకు ఇస్తామన్న ఆర్థిక సహాయం ఏమైందని ప్రశ్నించారు.
బనకచర్యలపై బండి ఎందుకు మాట్లాడడం లేదు..
పదే పదే కేసీఆర్ విమర్శిస్తున్న బండి సంజయ్ తెలంగాణకు అన్యాయం చేస్తున్న బనకచర్ల ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నీ సోపతి రేవంత్ రెడ్డి తో కలిసి దమ్ముంటే తుమ్ముడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎంతసేపు కేసీఆర్ పేరుతో కాలం వెల్లదీయడం తప్ప తెలంగాణ కోసం బండి సంజయ్ ఒక్క అభివృద్ధి పథకమైన తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు. చేతకాని అసమర్థ పాలకుల వల్లే తెలంగాణ మరో 20 ఏళ్లు అభివృద్ధిలో వెనకకు వెళ్తోందని వాపోయారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పున్నం అనిల్, కుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.