కాంగ్రెస్ సర్కారు ప్రజలతో దాగుడు మూతలు ఆడుతున్నది. పూటకోమాట.. నెలకో కార్యక్రమం పేరిట దరఖాస్తులు స్వీకరిస్తూ, ఆగం చేస్తున్నది. రేషన్‌కార్డుల కోసం పరేషాన్ చేస్తున్నది. ఇప్పటికే పలుసార్లు అర్జీలు తీసుకున్న సర్కారు, కొత్తగా మళ్లీ మీ సేవ కేంద్రాల్లో చేసుకోవాలని సూచించడంతో గందరగోళం నెలకొన్నది. వారం కింద ఆప్షన్ ఇచ్చినట్టే ఇచ్చి 24 గంటలు కాకముందే క్లోజ్ చేయడం, మళ్లీ రెండ్రోజుల కింద అవకాశం ఇస్తున్నట్లు చెప్పడంతో దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసలు ఎన్నిసార్లు నమోదు చేసుకోవాలి.. అప్లికేషన్లు ఇంకెన్ని చోట్ల ఇవ్వాలి’ అని ప్రశ్నిస్తున్నారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కింద పలు పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. అందులో కొత్త రేషన్‌కార్డుల కోసం జిల్లాలో దాదాపు 20వేల మంది అర్జీలు పెట్టుకున్నారు. వీటిని ఆన్లైన్లో ఎంట్రీ చేసిన అధికారులు, ఆ కొద్దిరోజులకే ఆ డాటాను పక్కనపడేసి సమగ్ర కుటుంబసర్వే ద్వారా వివరాలు సేకరించారు. 12,732 మందిని ఎంపిక చేశామని చెప్పారు. కానీ ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ఈ క్రమంలో రేషన్‌కార్డులు సహా నాలుగు పథకాల అమలు కోసం గత జనవరి 26 నుంచి నాలుగురోజుల పాటు గ్రామ సభలు నిర్వహించారు. కొందరి పేర్లు చదివి వినిపించారు. ఏమైందో ఏమో గాని మండలానికో పైలెట్ గ్రామంలో లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పి జిల్లా వ్యాప్తంగా కేవలం 359 మందికి మాత్రమే కార్డులు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు.
జిల్లాలో 35వేలపైనే అర్జీలు పెండింగ్
ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో కార్డులు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో కొత్త కార్డుల కోసం 25,182 మంది, మార్పులు, చేర్పుల కోసం మరో 10వేల మంది అర్జీలు పెట్టుకున్నారు. వీటిలో అర్హులైన వారి ఎంపిక కోసం డోర్‌టూ డోర్ సర్వే చేస్తామని ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉండగానే ప్రభుత్వం తాజాగా మరో కథ మొదలు పెట్టింది. మీసేవ కేంద్రాల్లో మళ్లీ అర్జీ పెట్టుకోవాలని చెప్పడంతో ప్రజలను గందరగోళంలో పడేసింది. ఎన్ని సార్లు దరఖాస్తులు చేసుకోవాలి? ఎన్ని చోట్ల అర్జీ పెట్టుకోవాలని మండిపడుతున్నారు. రోజుకో నిర్ణయం తీసుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌కార్డుల మంజూరీపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నదని మండిపడుతున్నారు. అయితే వారం క్రితం రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో కేంద్రాల వద్ద బారులు తీరారు. కానీ, సైట్ 24గంటలు తిరగక ముందే మూసివేయడంతో నిరాశ చెందారు. తిరిగి సోమవారం నుంచి మీసేవ కేంద్రాల ద్వారా ఐప్లె చేసుకోవాలని ప్రకటించడంతో ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఎన్ని అర్జీలు పెట్టాల్నో అర్థమైతలేదు
నేను గతేడాదే పెళ్లి చేసుకున్న. కొత్త రేషన్ కార్డు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న. కానీ కార్డు రాలె. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబితే గత నెలలో చేసిన. ఇప్పుడేమో..? మీ సేవకు పొమ్మంటున్నరు. అసలు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలో అర్థమైతలేదు. ఏ ప్రభుత్వమైనా ఒకసారి దరఖాస్తు చేసుకుంటే అర్హులను గుర్తించి కార్డులు ఇస్తరు. వీళ్లేమో దరఖాస్తులతోనే సరిపెడుతున్నరు. మమ్ముల తిప్పించి ఇబ్బంది పెడుతున్నరు. ఇది సరికాదు. ప్రభుత్వం స్పందించి కొత్త కార్డులు ఇవ్వాలె.
– బూడిద శివ సాయి, ఎక్లాస్పూర్ (మంథని మండలం)