Water connection | కార్పొరేషన్, మే 24 : కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తగా నల్లా కనెక్షన్ తీసుకొవాలన్న, ఉన్న నల్లా కనెక్షన్ పేరు మార్పిడీ చేసుకొవాలన్నా అష్టకష్టాలు పడాల్సినా పరిస్థితి నెలకొంది. నల్లా కనెక్షన్లు మంజూరు చేసే విషయంలో ఇంజనీరింగ్ అధికారులు ఇష్టరీతిన పెడుతున్న నిబంధనలతో ప్రజలు బేజారు అవుతున్నారు.
ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతాధికారులు మారినప్పుడల్లా సరికొత్త నిబంధనలు తీసుకువచ్చి దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో నల్లా కనెక్షన్ మంజూరీకి నెలల తరబడిగా సమయం పడుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడుగా తమ దరఖాస్తులపై కార్యాలయంలో విచారణకు వచ్చే ప్రజలు సరియైన సమాధానం ఇచ్చే అధికారులు, సిబ్బంది లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అధికారి ఇష్టం వచ్చినప్పుడల్లా నిబంధనల్లో మార్పులు
నగరపాలక సంస్థలో సాదారణంగా నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేస్తే సంబంధింత లైన్మెన్, ఎఈలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నల్లా మంజూరుకు అప్రువల్ ఇస్తూ నోట్‌ఫైల్ చేస్తే దీనిపై డీఈ, ఈఈలు తగు చర్యలు చేపడుతారు. కానీ కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు మారితే చాలు కొత్త నిబంధనలు అమలు చేస్తుండడంతో ప్రజలు గందరగోళం నెలకుంటుంది.
నల్లా కనెక్షన్ మంజారీకి, పేరు మార్పిడీకి గ్రేటర్ హైదరాబాద్ నిబంధనలు అమలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ ఏ నిర్ణయమైన అక్కడి వరకే పరిమితమవుతుంది. కానీ అదే విధానం మిగిలిన మున్సిపాలిటీలకు అమలు చేస్తుండడంతో దరఖాస్తులు పెండింగ్‌లో పడుతున్నాయి. దీంతో ప్రజలు కార్యాలయం చుట్టు తిరగాల్సి వస్తుంది. ఇప్పటికే నగరపాలక సంస్థ కొత్త నల్లాల కోసం 180 మేరకు ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయని నీటి నిర్వహణ విభాగం సిబ్బందే చెప్పుతున్నారు. ముఖ్యంగా ఎఈఈలు క్షేత్రస్థాయిలో పరిశీలన పేరుతో పెండింగ్‌లో పెడుతున్నారని, దీనికి తోడుగా కొత్త నిబంధనలు కూడ ఇబ్బందిగా మారుతుంది.
పేరు మార్పిడీకి అవస్థలే..
నల్లా కనెక్షన్ పేరు మార్పిడీ చేసుకొవాలంటే ముప్పు తిప్పలు పడాల్సి వస్తుంది. గతంలో పేరు మార్పిడీ చేయాలంటే రిజిస్ట్రేషన్ అయినా తర్వాత నగరపాలక రెవెన్యూ విభాగం ఇచ్చిన మ్యూటేషన్ పత్రం ఉంటే వెంటనే నల్లా కనెక్షన్లో కూడా పేరు మార్పు చేసేవారు. కానీ కొత్త వచ్చిన ఇంజనీరింగ్ అధికారులు ఎక్కడ లేని సరికొత్త నిబంధనలను తీసుకువచ్చారు. నగరపాలక సంస్థలోని రెవెన్యూ విభాగం ఇంటి మ్యూటేషన్ చేస్తూ పత్రం జారీ చేయగా అందులో ఉండే నల్లా కనెక్షన్ పేరు మార్చేందుకు దరఖాస్తుదారులను ముప్పతిప్పలు పెడుతున్నారు.
ఆస్తి పన్నుల్లో పేరు మార్పిడీ (మ్యూటేషన్) జరిగినా మరోసారి ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తప్ప నల్లా కనెక్షన్ మార్చేది లేదని తెలుస్తోంది. ఒకే సంస్థలోని ఓ విభాగం ఇంటి పేరు మార్చినప్పుడు అందులో ఉండే నల్లా పేరు మార్పిడి చేయటంలో మరోసారి పరిశీలన పేరుతో పెండింగ్‌లో ఎందుకు పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ హాయంలో మ్యూటేషన్‌లో ఇబ్బందులు తొలగించాలని రిజిస్ట్రేషన్ సమయంలో మున్సిపాలిటీల్లో మ్యూటేషన్ అయ్యే విధానాన్ని అమలు చేశారు. కానీ కరీంనగర్ బల్దియాలో మాత్రం ఇంటి పేరు మార్పిడీ పత్రం (మ్యూటేషన్)అయినా కూడా నల్లా పేరు మార్పిడీకి విచారణ పేరుతో అధికారులు ఆలస్యం చేస్తున్నారు.
దీనికి బల్దియాలో దరఖాస్తు చేసిన తర్వాత లైన్మెన్, ఎఈఈలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తర్వాత నోటి ఫైల్ కోసం డీఈ, ఈఈ సంతకాలు చేయాల్సి వస్తుంది. ఈ క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులు నెలల తరబడిగా సమయం తీసుకుంటుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంటి పేరు మార్పిడీ అవుతున్నప్పుడు అందులో ఉండే నల్లా కనెక్షన్ పేరు మార్పిడీకి ఇంతగా ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు. ఈ విషయంలో ప్రత్యేకాధికారి దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకొవాలని దరఖాస్తుదారులు కొరుతున్నారు.