పెద్దపల్లి, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): ‘ఇంత చిన్న చేప పిల్లలు దేనికి? కప్పలు, పాములకు ఆహారం కోసం ఇస్తున్నరా..? ఆగస్టులో పంపిణీ చేయాల్సింది కాలందాటిపోయిన తర్వాత ఇ ప్పుడు ఇస్తారా..? నాసిరకం విత్తనాలు అసలు ఈ చెరువులో బతుకుతయా..? కాంట్రాక్టర్లకు కాసులు కురిపించడానికి తప్ప మా కోసం కాదు. ఈ పిల్లలు మాకు అక్కర్లేదు’ అంటూ పెద్దపల్లి జిల్లాలోని మత్స్యకారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోజుకోచోట చెరువుల వద్దకు వచ్చిన చేప పిల్లల వ్యాన్లను వెనక్కి పంపించేస్తున్నారు. ఇక నుంచీ చేప విత్తనాలకు బదులు మాకు నగదు జమ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7న మంథని పట్టణంలోని త మ్మిచెరువులో రాష్ట్ర ఫిషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ చేప పిల్లల పం పిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అప్పుడు మాత్రమే నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు. కానీ, ఆ తర్వాత ఆయా చెరువుల్లో వేసేందుకు అధికారులు తెచ్చిన చేప పిల్లలు మాత్రం చాలా చిన్నగా నాసిరకంగా ఉంటుండడంతో మత్స్యకారు లు ఆందోళన చేస్తున్నారు.
రెండ్రోజుల కింద అంతర్గాం, పాలకుర్తి, రామగుండం మండలాల్లో పంపిణీ చేసేందుకు తెచ్చిన చేప పిల్లలు మరీ చిన్నగా ఉండడంతో తిరస్కరించారు. దాంతో అధికారులు పంపిణీ చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. శనివారం మంథని ప్రాంత చెరువుల్లో విడుదల చేసేందుకు తెచ్చిన దాదాపు రెండు లక్షల చేపపిల్లలు కూడా నాసిరకంగా ఉండడంతో వద్దని వెనక్కి పంపారు. కాంట్రాక్టర్లు, మత్స్యశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీడ్ నాణ్యత, ఆరోగ్య పరిస్థితిని మత్స్యశాఖ అధికారులు పరీక్షించి 80 నుంచి 100మిల్లీ మీటర్ల చేప పిల్లలు ఏడాదంతా నీరుండే పెద్ద చెరువుల్లో, సీజనల్ ట్యాంకు(చిన్న చెరువు)ల్లో 35-40మిల్లీ మీటర్ల సైజు పిల్లలను పోయాల్సి ఉంటుంది. కానీ, పూర్తిగా చిన్న పిల్లలు, నాసిరకమైనవి పంపిణీ చేస్తుండడంతో మత్స్యకారులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు.
ఇప్పుడు చేప పిల్లలు పోసే టైమే కాదు. మేం మొదటి నుంచి చెబుతున్నం. అన్ని చెరువుల్లో కుంటల్లో ఇప్పటికే చేప పిల్లలను పోసుకున్నం. ఇవెందుకు పోస్తున్నారో అర్థమైతలేదు. ఇప్పుడు నగదు బదిలీ చేస్తే సరిపోతుంది. అప్పుడు మాకు నచ్చిన నాణ్యమైన చేప పిల్లలను కొని తెచ్చుకుంటం. ఇలా కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల వాళ్లు బతకడమే కానీ మాకు ఏ మాత్రం ప్రయోజనం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ నాణ్యత లేని చేప పిల్లలను పోయనియ్యం. 35 నుంచి 40మిల్లీ మీటర్ల పొడువుండే చేప పిల్లలే మాకు కావాలి.
– కొలిపాక నర్సయ్య, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు (పెద్దపల్లి)
ఈ చేపలు చెరువుల్లో పోస్తే దేనికీ అక్కరకు రావు. మేం జూన్, జూలైలో పోసుకున్న చేపలే ఇప్పుడు దాదాపుగా 300 నుంచి 400 గ్రాముల వరకు పెరిగి ఉంటయి. ఇప్పుడు వేసే చేప పిల్లలు వాటికి ఆహారమవుతయి. మా మంథని ప్రాంతంలో 13సొసైటీలు ఉన్నయి. ఏ ఒక్క సొసైటీలో ఈ చేప పిల్లలను పోసుకోం. మాకు అక్కర లేదు. దాదాపు 2లక్షల చేప పిల్లలను వెనక్కి పంపుతున్నం.
– పోతరవేణి క్రాంతి, మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు (మంథని)