చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్ వస్తున్నది. మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా గత ప్రభుత్వం చెరువులను బట్టి మంచి సైజు పిల్లలు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు మాత్రం నిర్లక్ష్యం చూపినట్టు తెలుస్తున్నది. ఆగస్టు చివరి నుంచి పంపిణీ చేయాల్సి ఉన్నా.. పిల్లలను కాలం దాటిన తర్వాత పూర్తిగా నాణ్యతలేనివి సరఫరా చేయడంపై పెద్దపల్లి జిల్లాలో మత్స్యకారుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. అయితే ఈ విషయంలో ఇప్పటికే ఫిర్యాదులు రావడంతో కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇవ్వగా, తాజాగా జిల్లా అధికారిని బదిలీ చేసినట్టు తెలిసింది.
పెద్దపల్లి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఏటా చెరువులు, కుంటల్లో ఆగస్టు చివరి వారం వరకూ ఉచిత చేప పిల్లలను పంపిణీ ప్రారంభించి, రెండు నెలల్లో పూర్తి చేయాలి. టెండర్ల ప్రక్రియ నుంచి మొదలుకొని పంపిణీ వరకూ ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోనే జరగాలి. అందుకు సీడ్ నాణ్యత, ఆరోగ్య పరిస్థితిని మత్స్యశాఖ అధికారులు పరీక్షించి పంపిణీ చేయాలి. ఏడాదంతా నీరుండే చెరువుల్లో 80 నుంచి 100మిల్లీ మీటర్ల చేప పిల్లలు, సీజనల్ ట్యాంకు (చిన్న చెరువు)ల్లో 35 నుంచి 40మిల్లీ మీటర్ల సైజు చేపపిల్లలను నీటి విస్తీర్ణాన్ని బట్టి పోయాల్సి ఉంటుంది. కానీ, యేడాది పంపిణీ అంతా అస్తవ్యస్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు చేయకపోవడం, డిసెంబర్ వరకు గతంలో చేప పిల్లలు పంపిణీ చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించకపోవడంతో ఆలస్యమైంది. టెండర్లు పిలిచినా వేలంలో పాల్గొనేందుకు సీడ్ ఉత్పత్తిదారులు ముందుకు రాలేదు. గతేడాది పెద్దపల్లి జిల్లాలో కోటి 90లక్షల చేప పిల్లలను పంపిణీ చేయగా, ఈ యేడాది అందులో సగం చేసి టెండర్లు పిలువడంతో చివరికి కరీంనగర్, జగిత్యాలకు చెందిన కాంట్రాక్టర్లు టెండర్లను దక్కించుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలో 127 మేజర్ చెరువులు, 974 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. 157మత్స్య సహకార సంఘాలు ఉండగా, వాటి పరిధిలో 12,642 మంది మత్స్యకారులు, ఇంకా సభ్యత్వాలు లేక మరో 3వేల మంది చేపల వేటే వృత్తిగా జీవిస్తున్నారు. వీరి అభ్యున్నతే లక్ష్యంగా ఏటా ఉచిత చేపలను పంపిణీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు చివరి వారం వరకు పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా.. ఈసారి ఒక నెల ఆలస్యంగా అక్టోబర్‌లో శ్రీకారం చుట్టారు. ఈ నెల 7న మంథని తమ్మిచెరువులో రాష్ట్ర ఫిషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్ లాంఛనంగా ప్రారంభించారు. ఆ రోజు మంచి సైజు చేప పిల్లలే రావడంతో ఆలస్యంగానైనా నాణ్యమైనవే ఇచ్చారని మత్స్యకారులు ఆనందపడ్డారు. కానీ, ఆ తర్వాతే నాసిరకం ఇవ్వడంతో నిరాశ చెందారు. ఈ నెల 18నుంచి నవంబర్ 3వరకూ చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ షెడ్యూల్‌ను ప్రకటించడం, తొలిరోజు అంతర్గాం, రామగుండం, పాలకుర్తి మండలాల్లోని చెరువుల వద్దకు చేప పిల్లలతో కాంట్రాక్టర్లు, జిల్లా మత్స్యశాఖ అధికారులు వెళ్లారు. విత్తనాలు పూర్తిగా చిన్నగా చింతాకు సైజులో ఉండడంతో మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాపస్ పంపారు. అయినప్పటికీ 19న మంథని మండలంలో చేప పిల్లలను పంపిణీ చేయడానికి వెళ్లగా, అక్కడా అడ్డుకొని చేపపిల్లల వ్యాన్లను వెనక్కి పంపారు.
ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించి క్షేత్ర స్థాయిలో రెండు కమిటీలు పనిచేస్తాయి. ఒక కమిటీ నాణ్యమైన సీడ్ కోసం సీడ్ కంపెనీలను ఎంపిక చేసేందుకు పనిచేస్తుండగా.. మరో కమిటీ క్షేత్రస్థాయిలో చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదిలే సమయంలో నాణ్యతను పరిశీలిస్తుంది. కానీ, జిల్లాలో ఈ రెండు కమిటీల నిర్లక్ష్యం వల్ల నాసిరకమైన చేప పిల్లలు వచ్చాయి. సీడ్ కంపెనీని ఎంపిక చేసే సమయంలో జిల్లా మత్స్యశాఖ అధికారి, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు, జిల్లా కేంద్రానికి చెందిన ఒక తహసీల్దార్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి నేతృత్వంలోని కమిటీ సీడ్ పంపెనీలను పరిశీలిస్తున్నది. అక్కడ వాటి నాణ్యతను పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఏ మండలానికి, ఏ గ్రామానికైతే చేప పిల్లలను కాంట్రాక్టర్ తీసుకువస్తారో అక్కడ జిల్లా మత్స్యశాఖ అధికారి, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు, ఆ మండల తహసీల్దార్, ఎంపీడీవో, జీపీ కార్యదర్శి, ఆ గ్రామ మత్స్య సహకార సంఘం ప్రతినిధులు వాటి నాణ్యతను పరిశీలించి ఆ చేప పిల్లలు నాణ్యమైనవి అయితేనే వాటిని ఆ చెరువుల్లో వదులుతారు. కానీ, ఇక్కడ మత్స్యసహకార సంఘాలు మినహా ఎవరూ పరిశీలించక పోవడం వల్లే చేప చిన్నబోయింది. చెరువులు కుంటల్లో బొచ్చె, రవ్వు, బంగారు తీగ రకాలను పంపిణీ చేయాల్సి ఉన్నా, ఏవో నాసిరకమైన చేప పిల్లలను తీసుకొని వచ్చి పంపిణీకి సిద్ధపడ్డారు. పైగా ఉండాల్సిన సైజ్ కంటే తక్కువ.. నాసిరకం చేపలు పంపిణీ చేస్తున్నారని మత్స్యకారులు అడ్డుకున్నారు.
కాంట్రాక్టర్లు నాణ్యత లేని చేప పిల్లలను పంపిణీ చేయడంపై పెద్దపల్లి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య, డైరెక్టర్లు పోతరవేన క్రాంతి, కొలిపాక శ్రీనివాస్ హైదరాబాద్‌లోని స్టేట్ ఫిషరీస్ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. దీంతో కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతామని చైర్మన్ వారికి ఆయన హామీ ఇచ్చారు. ఆ మేరకు చర్యలు చేపట్టారు. ఈ నెల 18, 19 తేదీల్లో అంతర్గాం, పాలకుర్తి, రామగుండం, మంథనిల్లో నాసిరకమైన చేప పిల్లలు తెచ్చారని కరీంనగర్‌కు చెందిన కాంట్రాక్టర్ శ్రీ వర్షిణీ ఫిష్ సీడ్ యజమాని వినోద్‌కు జిల్లా మత్స్యశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా నాసిరకం చేప పిల్లల పంపిణీపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్‌ను బదిలీ చేసినట్టు తెలిసింది.