కరీంనగర్ రూరల్, జనవరి 18: గ్రామ అభివృద్ధి ప్రణాళిక పకడ్బందీగా రూపొందించాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం కరీంనగర్, తిమ్మాపూర్, కొత్తపల్లి, చొప్పదండి, మానకొండూర్ మండలాల పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు గ్రామ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ, గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేసి గ్రామస్థాయి అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని పేర్కొన్నారు.
గ్రామంలో పంచాయతీ కార్యదర్శి పాదయాత్ర నిర్వహించి, సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈనెల 31వ తేదీలోగా అన్ని గ్రామ పంచాయతీల్లో సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో డంప్ యార్డులు, వైకుంఠధామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రణాళిక తయారు చేయడంలో పంచాయతీ కార్యదర్శులే పూర్తి స్థాయి బాధ్యత వహించాలని, కంప్యూటర్ ఆపరేటర్‌తో వివరాలు సక్రమంగా నమోదు చేయించాలని ఆదేశించారు. పొరపాట్లు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శిక్షకుడు సురేందర్ మాట్లాడుతూ, గ్రామంలో పెండింగ్‌లో ఉన్న పన్నులు ఈనెల 31వ తేదీలోగా వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో హరికిషన్, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు, శిక్షకులు పాల్గొన్నారు.