విద్యా శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు మళ్లీ సమ్మెబాట పడుతున్నారు. ఎన్నికలకు ముందు సమ్మెలో పాల్గొన్న వీరికి అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. అరకొర వేతనాలతో జీవితాలు వెల్లదీస్తున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది కాలంలో అనేక విజ్ఞప్తులు, విన్నపాలు ఇచ్చినా తమ బాధలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో సిద్ధమైన పే స్కేల్ ఫైల్‌ను కొనసాగిస్తూ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే ముఖ్యమైన డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నారు. ఈ నెల 10 నుంచి పాల్గొనేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు.
కరీంనగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : సమగ్ర శిక్ష ఉద్యోగులు విద్యా శాఖలో 18 ఏండ్ల నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరికి వేతనాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. 2006లో రాజీవ్ విద్యా మిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థలో కలెక్టర్లు చైర్మన్లుగా ఉన్న త్రీమెన్ కమిటీ ద్వారా రోస్టర్ మెరిట్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఒప్పంద ఉద్యోగులుగా వీరిని ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో ఏపీవో, సిస్టం అనాలసిస్ట్ టెక్నికల్ పర్సనన్స్, ఆపరేటర్స్, డీఎల్‌ఎంటీ, మెసెంజర్లుగా, మండల స్థాయిలో ఎంఐఎస్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఆర్సీఎస్ మెసెంజర్స్, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, పాఠశాల స్థాయిలో పార్ట్‌టైం ఇన్స్స్టక్టర్స్, కేజీబీవీ యూఆర్ఎస్లలో స్పెషల్ ఆఫీసర్స్, పీజీసీ ఆర్టిస్టులు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్, క్రాఫ్ట్ అండ్ కంప్యూటర్ ఇన్స్స్టక్టర్స్, వాచ్మెన్, వంట చేసే సిబ్బంది (కుక్‌లు), స్కావెంజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైంది?
విద్యాశాఖలో విలీనం చేసి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని గతేడాది 22 రోజుల పాటు సమ్మెకు దిగగా, టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2023 సెప్టెంబర్ 13న హన్మకొండలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చాయ్ తాగినంత సమయంలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు తమ గోడును కూడా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. నిజానికి అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలోనే పే స్కేల్ ఫైల్ సిద్ధమైంది. ఎన్నికలు రావడంతో ఫైల్ మరుగున పడిపోయింది. లేదంటే అప్పుడే తమ సమస్యకు పరిష్కారం లభించేదని ఉద్యోగులు చెబుతున్నారు.
ఇతర రాష్ర్టాల్లో క్రమబద్ధీకరణ
దేశ వ్యాప్తంగా అనేక రాష్ర్టాలు సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు అందుతున్నాయి. మహారాష్ట్ర, ఒడిశా, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో పే స్కేల్ అమలు చేస్తున్నారు. అంతే కాకుండా, సుప్రీం కోర్టు ఇచ్చిన జీవో నంబర్ 4 ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తున్నారు. కానీ, రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా వేతనాలు ఇస్తున్నారు. విధి నిర్వహణలో ఉద్యోగి మరణిస్తే కనీసం దహనక్రియల ఖర్చులు కూడా చెల్లించడం లేదు. 61 ఏండ్లు నిండిన ఉద్యోగి ఉద్యోగ విరమణ చేస్తే రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా కల్పించడం లేదు. తమను క్రమబద్ధీకరించాలని కోరినా ప్రస్తుత ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆరోపిస్తున్నారు.
అన్ని పనుల్లో భాగస్వాములైనా..
సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రభుత్వం అప్పగించిన పనిలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పని విద్యను బోధిస్తూ వారిలో సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు. బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. విద్యార్థులకు దుస్తులు, పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. యూడీఎస్ ప్లస్‌లో డ్రాఫ్ట్ పిల్లల్ని ఇంపోర్ట్ చేయడం, రాపోట్ చేయడం, ప్రొఫైల్స్ అప్డేట్ చేయడం, డీఎస్ఈ, ఎఫ్ఆర్ఎస్ విద్యార్థుల ఆన్లైన్ హాజరును ఎప్పటికప్పుడు చూసుకోవడం, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌కు సంబంధించిన ప్రతి విషయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం అప్పగించిన ఇతర కార్యక్రమాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే విధులు నిర్వహిస్తూ అరకొర వేతనాలతో కాలం వెల్లదీస్తున్నారు.
10 నుంచి నిరవదిక సమ్మె..
సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10 నుంచి మరోసారి సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవదిక సమ్మెకు దిగుతున్నారు. అందులో భాగంగా గత నెల 22న తెలంగాణ సమగ్ర వర్క్, ఆర్ట్స్ ఫిజికల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్ఎస్యూఎస్) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యా శాఖకు మొదటి సారి నోటీసు ఇచ్చారు. 15 రోజుల వ్యవధిలో ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నెల 6న మరోసారి సమ్మె నోటీసు అందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 1,993 మంది సమగ్ర శిక్ష సమ్మెలో పాల్గొననున్నారు.
ప్రధానమైన డిమాండ్లు
సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. అప్పటి వరకు పే స్కేలును అమలు చేయాలి.
సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి
మహిళా ఉద్యోగులకు వేతనంతో 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలి.
61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.20 లక్షలు చెల్లించాలి.
ప్రతి ఉద్యోగికి జీవిత బీమా కింద రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా కింద రూ. 5 లక్షలు కల్పించాలి.
చాలీ చాలని జీతాలతో గడుపుతున్నాం
మా విధులనే కాకుండా ప్రభుత్వం అప్పగిస్తున్న ప్రతి పనినీ చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల మాదరిగానే విధులు నిర్వహిస్తున్నాం. కానీ, సమాన పనికి సమాన వేతనం అందడం లేదు. సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశాం. కానీ, ఈ ప్రభుత్వం మా ఆక్రందనలను పట్టించుకోవడం లేదు. చాలీచాలని వేతనాలతో ఏండ్ల తరబడిగా జీవితాలు నెట్టుకొస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో మరోసారి సమ్మెకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా..
– కనుకుల రమేశ్, టీఎస్ఎస్యూఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఇతర రాష్ర్టాల మాదిరే క్రమబద్ధీకరించాలి..
ఇతర రాష్ర్టాల మాదిరిగా మమ్మల్ని కూడా క్రమబద్ధీకరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో పే స్కేల్ ఇస్తున్నారు. మేం మొదటిసారి సమ్మెలో ఉన్నపుడు హన్మకొండలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. విద్యా వ్యవస్థ ఈ కార్యక్రమాన్ని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సమయంలో ఈ సమస్యను పరిష్కరిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏడాదైనా పరిష్కారంకాలేదు. అందుకే సమ్మెకు వెళ్తున్నాం.
– జీ రాజిరెడ్డి, టీఎస్ఎస్యూఎస్ జిల్లా అధ్యక్షుడు
క్రమబద్ధీకరణ ఒక్కటే మా డిమాండ్
మేం గత పద్దెనిమిదేండ్లుగా సమగ్ర శిక్షలో విధులు నిర్వహిస్తున్నాం. ఎప్పటికైనా రెగ్యులర్ చేస్తారని ఆశతో ఉన్నాం. ఇప్పటికే చాలా మంది రిటైర్మెంట్ వయసుకు వచ్చారు. ఇంకెప్పుడు రెగ్యులరైజ్ చేస్తారు. 2023లో సమ్మె చేసినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చారు. కానీ, ఒక్కటి కూడా అమలు చేయలేదు. సమాన పనికి సమాన వేతనం కోరుతున్నాం. శ్రమకు తగిన ఫలితం దక్కాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది.
– చంద్రగిరి మహేశ్, టీఎస్ఎస్యూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి