ముకరంపుర, సెప్టెంబర్ 25 : కొత్తపల్లి మండలం ఎలగందుల అనుబంధ గ్రామం బోనాలపల్లెకు గురువారం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ(ఐఎస్‌డబ్ల్యూ) బృందం వచ్చింది. గ్రామానికి అర కిలోమీటర్ దూరంలోని ఫైరింగ్ రేంజ్ నుంచి దూసుకొస్తున్న బుల్లెట్లతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘బోనాలపల్లెకు తూటా భయం’ శీర్షికన ఈ నెల 23న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని కదిలించింది. దీంతో ఫైరింగ్ రేంజ్‌తోపాటు గ్రామంలోని పరిస్థితులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందం గురువారం ఉదయం 11 గంటల తర్వాత స్థానిక పోలీసులతో బోనాలపల్లెకు చేరుకున్నది.
ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గోడు వెల్లబోసుకున్నారు. బుల్లెట్లు దూసుకొస్తున్న తీరును కండ్లకు కట్టినట్టు వివరించారు. ఫైరింగ్ రేంజ్‌తో తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు గ్రామంలో పర్యటించారు. ఈ నెల 20న తూటా తగిలి గాయపడ్డ వృద్ధురాలు అమృతమ్మతో మాట్లాడి, ప్రమాదం జరిగిన తీరు గురించి క్షుణ్నంగా అడిగి తెలుసుకున్నారు. తొడ భాగంలో తూటా గాయాన్ని పరిశీలించారు. రేకులను చీల్చుకుని వచ్చి తూటా పడ్డ మరో ఇంటిని పరిశీలించారు.
తూటాల ప్రభావానికి గురైన ఇండ్ల ప్రాంతాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం పోలీస్ అధికారులు డ్రోన్ సహాయంతో బోనాలపల్లెతోపాటు ఫైరింగ్ రేంజ్ వరకు ఉన్న ప్రాంతాలను చిత్రీకరించారు. ఫైరింగ్ రేంజ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఫైరింగ్ శిక్షణ సమయంలో ఏ రకం ఆయుధం నుంచి బుల్లెట్ ఏ విధంగా దూసుకు పోయే అవకాశమున్నది? ఫైరింగ్ రేంజ్‌కు బోనాలపల్లెకు మధ్యలో ఉన్న గుట్టను దాటుకుని బుల్లెట్లు దూసుకుపోవడానికి కారణాలు ఏంటి? అనే అంచనాలతో వివరాలు సేకరించారు.