Peddapally | పెద్దపల్లి, నవంబర్15: పెద్దపల్లి జిల్లా మంథని సింగిల్ విండో కు సంబంధించిన ఆదాయ, వ్యయాల వివరాలు దరఖాస్తుదారుడు ఇనుమల సత్యానారాయణకు రెండు వారాల్లో పూర్తి సమాచారం ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా సహకార అధికారిణి, రాష్ట్ర సమాచార కమిషనర్ ఎం వైష్ణవి ఆదేశాలు శుక్రవారం జారీ చేశారు.
ఆర్టీఐ దరఖాస్తుదారుడు సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంథని సింగిల్ విండోకు సంబంధించిన 2020 ఏప్రిల్ 1 నుంచి సొసైటీ నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వార్షిక నివేదికలు, ఆదాయ వ్యయాల వివరాలు, సుతిలి, వరి కల్లాల ఏర్పాటు ఖర్చులు, వాటర్, ఎలక్ట్రిక్ సామగ్రీ కొనుగోలు, సొసైటీ ఆడిట్ నివేదికలు, విచారణల నివేదికలు, వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికల వివరాలు కోరుతూ పెద్దపల్లి జిల్లా సహకార అధికారికి 2023 ఏప్రిల్ 1న దరఖాస్తు చేయగా పీఐవో స్పందించకపోవటంతో 2023 జూన్ 16న అప్పీలేట్ అధికారి జిల్లా సహకార అధికారికి అప్పీల్ చేశానని తెలిపారు.
అయినప్పటికీ సమాచారం ఇవ్వని జిల్లా సహకార శాఖ అధికారులపై తెలంగాణ రాష్ర్ట సమాచార కమిషన్ కార్యాలయంలో అప్పీల్ చేయగా నోటీసులు జారీ చేశారు. రాష్ర్ట సమాచార కమిషన్ కార్యాలయంలో శుక్రవారం విచారణ జరిపిన రాష్ర్ట సమాచార కమిషనర్ వైష్ణవి రెండు వారాల్లో పూర్తి సమాచారం ఇవ్వాలని జిల్లా సహకార శాఖ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.