Collector Pamela Satpathi | గంగాధర, అక్టోబర్ 17 : పౌష్టికాహారం తీసుకోవడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి హాజరైనారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం, చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించగా గర్భిణులకు సారె, పసుపు, కుంకుమ, పౌష్టికాహారాన్ని అందజేశారు. చిన్నారులకు పౌష్టికాహారంతో అన్నప్రాసన చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలలోని మహిళల ఆరోగ్యం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం సభా కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పోషకాహార లోపం ఉన్న మహిళలు, చిన్నారులను గుర్తించి వారికి మాతా శిశు సంరక్షణ ద్వారా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం సభ కార్యక్రమం ద్వారా పోషకాహార లోపంపై గ్రామాల్లో మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహాలక్ష్మి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు ఇలా ఏ పథకం తీసుకున్న మహిళలే ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ రజిత, ఎంపీడీవో రాము, సిడిపిఓ నర్సింగరాణి, ఎంఈఓ ప్రభాకర్ రావు, అంగన్వాడి సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.