Korutla | కోరుట్ల, జూలై 14 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా మాట్లాడినందుకు గాను సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కోరుట్ల పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈనెల 11న హైదరాబాదులోనీ మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా ఉన్నాయన్నారు. ఆత్మహత్యలకు ఉసిగొల్పేలా అత్యంత వివాదాస్పద, ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023 కింద సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలిపారు.
రాష్ట్రంలో రాబోయే సూపర్ ఎల్ నినో కరవు పరిస్థితులపై ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోందని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సీఎం బహిరంగంగా సమాధానం ఇస్తూ… ‘ఈ కరవు సమస్య తీరాలంటే ప్రతిపక్ష నాయకులు కే చంద్రశేఖర్ రావు, తన్నీరు హరీష్ రావు, కేసీఆర్ కుటుంబ సభ్యులు, రైతుల రక్తాన్ని తెలంగాణ పొలాల్లో చిందించడానికి కూడా నేను సిద్ధమే’ అని వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష నాయకులు తమ ఒంటికి బండరాయి కట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో దూకి చావాలి.. అప్పుడే తెలంగాణకు వీరి నుండి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది అని ప్రత్యక్షంగా, బహిరంగంగా మాట్లాడడం హింసను ప్రేరేపించడమే’ నని తెలిపారు.
రాష్ట్రంలో అత్యున్నత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ విమర్శల కిందకు రాదని, ఇది ముమ్మాటికీ నేరాన్ని, హింసను ప్రేరేపించడమే అవుతుందని సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు చిటి వెంకటరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీమ్, యువజన నాయకులు మహమ్మద్ అతిక్, పొట్ట సురేందర్, జాల వినోద్ కుమార్, బైరి విజయ్, టేకుల నరేష్, నీలి శ్రీనివాస్, మోసిన్, అస్లాం ఖురేషి, వాసిక్ రహమాన్, మహేష్, వనతడుపుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.