Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 8 : రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన రెండేళ్లలో అభివృద్ధి జాడ లేదనడానికి కూరగాయల మార్కెట్ ఏరియా ఒక్కటే సరిపోతుందని కమ్యూనిస్టు పార్టీ నేతలు ధ్వజమెత్తారు. గోదావరిఖని మార్కెట్ ఏరియా రోడ్డులో మంగళవారం నిరసన చేపట్టారు. మందులకని పోయి మాసికానికి వచ్చినట్టు రామగుండం ఎమ్మెల్యే పాలన ఉందని ఆరోపించారు. రామగుండం నగరపాలక సంస్థ లో కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై రూ. కోట్ల ప్రజాధనం ను పంచుకుంటున్నా పట్టించుకునే నాధుడే లేడని వాపోయారు. ఈ సందర్భంగా సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, నగర కార్యదర్శి కే. కనకరాజ్ మాట్లాడారు. కొత్త కూరగాయల మార్కెట్ సమీపంలో అసంపూర్ణంగా ఉన్న సిసి రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా రూ.13.70 కోట్ల నిధులతో చేపట్టిన యూజీడి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. అందుకు నిదర్శనంగా కూరగాయల మార్కెట్ ఏరియాలో ఓ కాంట్రాక్టర్ నిర్మించిన నాసిరకం యూ జీ డీ పనులే నని పేర్కొన్నారు. ఈ విషయమై విజిలెన్స్, సిడిఎంఏ, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో మున్సిపల్ కాంట్రాక్టర్లు తమ అవినీతిని యదేచ్చగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో కానీ కార్పొరేషన్ లో గాని అభివృద్ధికి ఆమడ దూరంలో పనులు జరుగుతున్నాయని ఆరోపించారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రోడ్లను ధ్వంసం చేసి నూతన రోడ్లు నిర్మిస్తామని చెప్పి వెళ్ళిపోతున్నారు తప్ప గత రెండేళ్లలో ఈ రోడ్డు ధ్వంసమై గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలువ ఉండడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కుండీలు చాంబర్లు ఆరు నెలలు కాకముందుకే ధ్వంసమైన పద్ధతి చూస్తే ఎంత నాణ్యతతో నిర్మించారు స్పష్టంగా అర్థమవుతుందని విమర్శించారు. 800 కోట్లు తెచ్చి రామగుండాన్ని అభివృద్ధి చేస్తున్నానని ప్రగల్బాలు పలుకుతున్న ఎమ్మెల్యే, మేయర్ ఒక్కసారి ఆకాశం నుండి భూమి మీదకు వచ్చి కింద చూస్తే వాళ్ళు చేసే అభివృద్ధి కళ్ళకు కనబడుతుంది అని చెప్పి దుయ్యబట్టారు. రామగుండం కార్పొరేషన్ లో గత మూడు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా పనులు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతిని ఉద్యమాల ద్వారానే ఎండగడతామని హెచ్చరించారు. సిపిఐ శివాజీ నగర్ శాఖ కార్యదర్శి రాణవేణి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య సిపిఐ నాయకులు రేణిగుంట్ల ప్రీతం, పోతరాజు నాగరాజు, సాధుల శివ, షేక్ చాంద్, సదానందం తదితరులు పాల్గొన్నారు.