పశ్చిమాసియా యుద్ధం పేరుతో గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ బాదుడుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏకంగా ప్రతినెలా రూ.50 కోట్ల భారం మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో కేంద్రం చెబుతున్న మాటలకు, పెంచుతున్న ధరలకు ఏమాత్రం పొంతన ఉండడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గృహావసరాల సిలిండర్లపై ఇటీవల పెంచిన ధరలతో ఇప్పటికే నెలకు దాదాపు రూ.10 కోట్ల భారం మోస్తుండగా, తాజాగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు వ్యాపారులకు శరాఘాతంగా మారాయి. కేవలం ఐదు నెలల్లో ఆరు సార్లు పెరగడం ఒక ఎత్తయితే.. 2025 డిసెంబర్‌తో పోల్చి చూస్తే కమర్షియల్ సిలిండర్ ధర అమాంతం రూ.1513 పెరిగింది. ఈ పెంపు వల్ల ఇక నుంచి ప్రతినెలా దాదాపు రూ.40 కోట్ల అదనపు భారం వ్యాపార రంగాలపై పడనున్నది. ఈ భారాన్ని తిరిగి ప్రజలపై వేయడానికి ఆయా హోటళ్లు రెస్టారెంట్లు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. త్వరలోనే డొమెస్టిక్ ధరలు కూడా భారీగా పెరుగుతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
– కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పశ్చిమాసియా యుద్ధం పేరుతో గత మార్చిలో గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.60 పెంచిన విషయం తెలిసిందే. అయితే, ఆ తదుపరి కూడా మరోసారి డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెంచే దిశగా కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఐదు రాష్ర్టాల్లో ఇటీవల జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెంచకుండా ఆపినట్టు తెలుస్తోంది. డొమెస్టిక్ సిలిండర్లపై గ్యాస్ ధరలు పెంచబోమంటూ కేంద్రం ప్రకటనలు ఇస్తున్నా నమ్మశక్యంగా లేవన్న విమర్శలు వస్తున్నాయి. గత మార్చిలో రూ.60 పెంపునకు ముందు కూడా ఇదే విషయం చెప్పింది.
కానీ, రాత్రికి రాత్రే అమాంతంగా పెంచింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం 10,87,360 కనెక్షన్లు ఉన్నాయి. గృహ వినియోగానికి 14.2 కిలోల సిలిండర్ ధర రూ.925 ఉండగా పెంచిన రూ.60తో కలిపి చూస్తే ఆ ధర రూ.985కి చేరింది. నెలకు ఒక సిలిండర్ చొప్పున బుక్ చేసుకున్నా.. పెరిగిన ధరల ప్రకారం ప్రజలపై నెలకు దాదాపు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల భారం పడుతుంది. అయితే, ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. పశ్చిమాసియా యుద్ధం పూర్తిగా సమసిపోలేదని, ఆది ఏ రూపంలో అయినా ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐదు రాష్ర్టాల్లోనూ ఎన్నికలు పూర్తయ్యాయి. వాటి ఫలితాలు ఈనెల 4న వెలువడనున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నా.. ఆ తదుపరి డొమెస్టిక్ రేట్లు పెరుగుతాయన్న చర్చే ప్రస్తుతం జరుగుతోంది.
కమర్షియల్‌పై నెలకు రూ.40 కోట్ల భారం
ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ పేరు చెబితే.. వ్యాపారులు బెదిరిపోతున్నారు. ఇంత రేట్లు పెరిగినా సజావుగా లభ్యం కావడం లేదు. అంతా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నాయి. పెరిగిన భారమే భరించలేని పరిస్థితుల్లో ఉంటే.. ఇక మళ్లీ బ్లాక్‌లో ఒక్కో సిలిండర్‌పై రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు అదనపు భారం భరించాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2025 డిసెంబర్ 1 నాటికి 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1801.50గా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కేంద్రం ఆరు సార్లు ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచింది. 2025 డిసెంబర్‌కు నేటి ధరకు తాజాగా, పెరిగిన రూ.993ను కలుపుకొని మొత్తంగా రూ.1513 పెరగగా, ఒక్కో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,314కు చేరింది. ఉమ్మడి జిల్లాలో 2,62,936 కమర్షియల్ కనెక్లన్లు ఉండగా, తాజాగా ఒక్కో సిలిండర్‌పై పెంచిన భారాన్ని పరిగణలోకి తీసుకొని చూస్తే నెలకు ఒక్కటి బుక్ చేసినా ప్రతినెలా రూ.50 కోట్ల అదనపు భారం పడనుంది.
ఈ వ్యవస్థ ఇక్కడితో ఆగడం లేదు. ఇంత పెద్ద మొత్తంలో ధరలు పెంచినా.. డిమాండ్ మేరకు కమర్షియల్ సిలిండర్లు సరఫరా కావడం లేదు. కారణం ఏమిటంటే.. బ్లాక్‌కు తరలుతున్నాయి. అక్కడ ఉన్న ధరపై అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు చెల్లిస్తేనే లభ్యమవుతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా పెంచిన రేట్లు ఒకవైపు.. బ్లాక్ మార్కెట్లో దోచుకుంటున్నతీరు మరోవైపు కలిపి ప్రస్తుతం వ్యాపార రంగాలకు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తోంది. గత జనవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు రూ.200 నుంచి రూ.300 వరకు పెంచుతూ వచ్చిన కేంద్రం మే 1న మాత్రం ఏకంగా ఒక్కో సిలిండర్‌పై రూ.993 పెంచడం పెద్ద గుది బండగా మారింది. పెరుగుతున్న కమర్షియల్ ధరలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలు రకాల ఫుడ్ఐటమ్స్పై ధరలు పెంచిన రెస్టారెంట్లు, హోటల్ నిర్వాహకులు ఇప్పుడు మరింత పెంచే దిశగా చూస్తున్నారు. ధరలు పెంచకుండా భారాన్నిమోసే పరిస్థితి తమకు లేదంటున్నారు. ప్రధానంగా చిరు వ్యాపారులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది.
పొంతన లేని మాటలు
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మనపై పడకుండా చూసుకుంటున్నామని, గ్యాస్, పెట్రోలు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని మోదీ సర్కారు పదే పదే చెబుతూ వచ్చింది. కానీ, ఆచరణలో చూస్తే మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గృహావసరాలకు సంబంధించిన ఒక్కో సిలిండర్‌పై రూ.60 పెంచిన కేంద్రం మరింత పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రూ.60 పెరిగిన తర్వాత కూడా గ్యాస్ సరఫరాపై ఆంక్షలు మాత్రం తొలగలేదు. డిమాండ్ మేరకు సరఫరా కావడం లేదు. ఒకవైపు కొరత లేదంటూ చెపుతూనే మరోవైపు ఆంక్షలు కొనసాగిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక కమర్షియల్ సిలిండర్ విషయంలో మాత్రం వ్యాపార వర్గాలకు కేంద్రం షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. రెస్టారెంట్లు, హోటళ్లలో రేట్లు పెంచితే తద్వారా విక్రయాలు తగ్గుతాయని, వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గుతుందని పేర్కొంటున్నారు. పోనీ పెరిగిన ధరలను చూస్తే పెంచక తప్పే పరిస్థితి లేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. నిజానికి గ్యాస్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెపుతున్న మోదీ సర్కారు.. ధరలు పెంచుతూ పోవడం వల్ల ఈ భారం తిరిగి ప్రజలపైనే పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మాసోంటోళ్లకు పెద్ద దెబ్బే
రోజూ హోటల్ నడిస్తేనేగానీ పూట గడవని పరిస్థితి. గ్యాస్ ధరలు పెంచితే మాసోంటి చిరు వ్యాపారాలకు పెద్ద దెబ్బే. హోటళ్లు నడువయి. ఓ వైపు నిత్యావసరాలు, వంట నూనె ధరలు విపరీతంగా పెరిగాయి. మేం టిఫిన్, టీ చార్జీలు పెంచాం. ఇంతకుముందు రూ.25 ఉన్న ప్లేట్ మిర్చి బజ్జీనీ రూ.30 చేశాం. కానీ గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇంతకుముందు రోజుకు రూ.2వేల నుంచి రూ.3వేల గిరాకీ అయితుండే. ఇప్పుడు అతి కష్టంమీద రూ.600-800 దాకా అయితుంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ వాణిజ్య సిలిండర్ ధర రూ.3400 పెంచిన్రు. వ్యాపారం ఎట్లా నడుస్తది. పరిస్థితి ఇట్లనే ఉంటే హోటల్ మూసుకునుడే. పని కోసం లేబర్ అడ్డాకు పోవుడే అయితది.
-అరపోల్లా శివకుమార్, హోటల్ యజమాని,(పెద్దపల్లి, నమస్తే తెలంగాణ)
హోటల్ నడపడం కష్టమే
మేం 60 ఏండ్ల నుంచి హోటల్ వ్యాపారంలో ఉన్నాం. గడిచిన రెండు నెలల నుంచి ఎదురవుతున్న కష్టాలు ఏనాడూ రాలేదు. గతంలో కమర్షియల్ సిలిండర్ కావాలంటే రెండు రోజుల్లో దొరికేది. కానీ ఇప్పుడు అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల దొరుకుడే కష్టమైతుంది. వారంలో రెండు మూడు రోజులే హోటల్ తీస్తున్నాం. గతంలో సిలిండర్ ధర రూ.2వేల లోపు ఉండేది. యుద్ధం మధ్యలో రూ.2400, ఇప్పుడు రెండు రోజుల నుంచి ధర అమాంతం పెరిగి రూ.3400 అయింది. మొన్నటిదాకా మా హోటల్లో చాయి, పూరి, మిర్చి బజ్జిలు చేసోటోళ్లం. ఇప్పుడు ఏదో ఒకటి మాత్రమే చేస్తూ, చాయి పెట్టి ప్లాస్క్‌లో పోసి అమ్ముతున్నాం. మాసోంటి చిన్న హోటళ్ల నిర్వాహకుల గురించి ప్రభుత్వాలు ఆలోచించి, పెంచిన ధరలు తగ్గించాలి.
– దాసు, అర్జున్ హోటల్, టవర్ సర్కిల్ (జగిత్యాల)
బుకింగ్ కూడా అయితలేదు
ఇందిరానగర్ హనుమాండ్ల గుడికాడ మా చాయ్ హోటల్ ఉంది. పదిహేనేండ్లసంది నడుపుతున్న. గిన్నేండ్లల్ల ఎన్నడూ ఇసోంటి గోస రాలే. సిలిండర్ కోసం ఫోన్ చేస్తే బుకింగ్ అయితేనే వేస్తమని చెబుతున్నరు. ఫోన్ల బుకింగ్ నెంబర్ కొడితే అయిత లేదు. ఎన్ని సార్లు ప్రయత్నించినా కాలేదు. ఇంట్లో కూడా గ్యాస్ వేస్తలేరు. గిట్లయితే హోటల్ ఎట్ల నడుస్తది. మేమేట్లా బతుకుడు. ప్రభుత్వమే సిలిండర్లను వేగంగా అందించేలా చూడాలె.
– బక్కివారి శాంత, ఇందిరానగర్ (సిరిసిల్లటౌన్)
రేట్లు పెరిగితే సామాన్య ప్రజలపైనే భారం
కేంద్రం గ్యాస్ ధరలు పెంచడం వల్ల వ్యాపారులకు పెద్దగా నష్టమేమీ ఉండదు. ఎటు తిరిగి మళ్లీ సామాన్యులపైనే భారం పడుతది. ధరలు పెరిగినప్పుడు ఒకటి, రెండు రోజులు హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు మూసి, మరుసటి రోజు నుంచి చాయ్, టిఫిన్ల రేట్లు పెంచుతారు. వినియోగదారుడి జేబులకే చిల్లు పడుతుంది. ఐదు నెలలుగా కేంద్రప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.3400 చేయడం సమంజసం కాదు. ఇప్పుడు సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులపై ఏమాత్రం ఆలోచన, బాధ్యత లేకపోతే ఎట్లా?. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని మాటివ్వడం, తర్వాత ఎడాపెడా ధరలు పెంచితే ఎట్లా బతుకుతరు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేతగాని పాలనకు నిదర్శనమనే చెప్పాలి.
– కొత్తపల్లి ప్రసన్నకుమార్, బాపూజీ నగర్, గోదావరిఖని.
ఉపాధికి పెద్ద దెబ్బ..
వాణిజ్య సిలిండర్ ధర పెంపు మాలాంటి చిరు వ్యాపారుల ఉపాధికి పెద్ద దెబ్బే. ఇప్పటికే గ్యాస్ సరఫరాలో ఆటంకంతో తీవ్ర కష్టాలు పడుతున్నాం. వాణిజ్య సిలిండర్లు దొరకని పరిస్థితి నెలకొంది. సిలిండర్లకు అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. చిన్నపాటి హోటల్‌పై ఇంటిల్లిపాది ఆధారపడాల్సి వస్తుంది. వినియోగదారులు తగ్గుతారని టిఫిన్ల ధరలు పెంచలేదు. గ్యాస్ సిలిండర్ కొరతో ప్రత్యామ్నాయంగా డీజిల్‌తో నడిచే స్టౌ వాడుతున్నాం. అయినా నష్టాలు వస్తున్నాయి. వాణిజ్య సిలిండర్ల ధరను ప్రభుత్వం తగ్గించాలి. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
– రంజిత్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, కోరుట్ల
