కొత్తపల్లి, నవంబర్ 21: యువతలో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు ఎంతగానో దోహదపడుతాయని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు శుక్రవారం అంబేదర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ ఉంటుందని, దానిని బయట తీయటానికి యువజనోత్సవాలు ఎంతగానో దోహదపడుతాయని తెలిపారు. ప్రతిఒక్కరూ స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. సామాజిక సేవలో కృషి చేస్తున్న యువజన స్వచ్ఛంద సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. సిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశా రు.
కాగా, జానపద నృత్యంలో గౌతమి గ్రూప్(లంబాడీ డాన్స్), జానపద గేయంలో నక శివరాం గ్రూప్, కథ రచనలో మౌనిక, పెయింటింగ్‌లో పాయల్, ఉపన్యాసంలో వైశాలి, కవిత్వంలో నళిని, సైన్స్మేళాలో అక్షయ, అమూల్య ప్రతిభ చూపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా యువజన, క్రీడ శాఖాధికారి వీ శ్రీనివాస్‌గౌడ్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాం బాబు, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాశ్, జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి, జాతీయ యువజన అవార్డు గ్రహీత రెండ్ల కళింగ శేఖర్, రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్తినేనీ శ్రీనివాస్, జిల్లా యువజన అవార్డు గ్రహీత బంధారపు అజయ్ కుమార్, యోగా అసోసియేష్ అధ్యక్షులు సిద్ధారెడ్డి, బాల భవన్ సూపరింటెండెంట్ మంజులవాని, గందెకల్పన, కర్రె పావని పాల్గొన్నారు.