కలెక్టరేట్, జనవరి 4: అంధులను ఆదర్శంగా తీసుకుంటే అద్భుత విజయాలు సాధించవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని గురువారం నగరంలోని శాతవాహన విశ్వవిద్యాలయం సమీపంలో గల బ్రెయిలీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ, అంధత్వం కొంత లోటు కన్పించినా, జ్ఞాన నేత్ర రూపంలో అంధులు ప్రపంచాన్ని చూడగలిగే శక్తితో అర్థవంతమైన జీవితాన్ని గడుపుతారని అన్నారు. అంధత్వాన్ని వైకల్యంగా భావించి బాధపడితే భవిష్యత్ ఉండదని, 48 ఏళ్ల జీవన గమనంలో అంధుల కోసం లూయిస్ బ్రెయిలీ ప్రత్యేక లిపిని సృష్టించి, వారికి అంధత్వాన్ని జయించే ఆశాజ్యోతిగా మారాడని కొనియాడారు.
ఆయన సృష్టించిన లిపితోనే ప్రస్తుతం అంధులు చదవడం, రాయడంతో పాటు కంప్యూటర్‌పై కూడా పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి మనిషిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని, దానిని గుర్తించి సక్రమంగా వినియోగించుకుంటూ కష్టపడి అద్భుత విజయాలు సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. అంధ విద్యార్థులను కలెక్టర్ దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడారు.
లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులకు ఉచితంగా కీబోర్డు ప్లే శిక్షణ ఇస్తున్న శిక్షకుడు రాజ్‌కుమార్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ఎం సరస్వతి, అంధుల, బధిరుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు నర్మద, నాగలక్ష్మి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కేశవరెడ్డి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్స్ అధ్యక్షుడు సురేశ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, చైర్మన్ సింగరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ సంపత్, సఖీ సెంటర్ నిర్వాహకురాలు రజినీ, మహిళా హబ్ కో-ఆర్డినేటర్ శ్రీలత పాల్గొన్నారు.
బడీడు పిల్లలను పాఠశాలకు పంపించాలని కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులను కోరారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆపరేషన్ స్మైల్‌పై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పిపోయిన పిల్లల కోసం ప్రతి జనవరిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల ఒకటి నుంచి 31వ తేదీ వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు, కార్మిక, విద్య, రెవెన్యూ శాఖల సమన్వయంతో బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పని నుంచి విముక్తి కల్పించిన బాలలను పాఠశాలల్లో చేర్పించాలని, పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు ఫోన్ చేస్తే సంబంధిత అధికారులు వచ్చి సాయం చేస్తారని చెప్పారు. ఆపరేషన్ స్మైల్‌కు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. డీడబ్ల్యూవో సరస్వతి, ఆర్డీవో మహేశ్వర్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, పరిశ్రమల శాఖ అధికారి నవీన్, కార్మిక శాఖ కమిషనర్ సామ్యేల్, డీఎంహెచ్‌వో డా. లలితాదేవి, డీసీపీవో శాంత, సీహెచ్ఎల్ సంపత్, సఖీ సమన్వయకర్త లక్ష్మి, పోలీసులు పాల్గొన్నారు.