కలెక్టరేట్, జనవరి 19: జిల్లాలో గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, గణతంత్ర వేడుకలకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలన్నారు.
వేడుకల్లో పాల్గొనే వారికి కుర్చీలు, మంచినీరు, తదితర ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, స్వీప్ అవగాహన కార్యక్రమాలతో పాటు విద్యావ్యవస్థలో కల్పిస్తున్న సౌకర్యాలపై పిల్లలతో లఘు నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆయా శాఖల స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతర కార్యక్రమాల్లో ప్లాస్టిక్ బాటిల్స్ వాడొద్దని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో పవన్ కుమార్, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు మహేశ్వర్, రాజు, డీఆర్డీవో శ్రీలత, సీపీవో కొమురయ్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, డీడబ్ల్యూవో సరస్వతి, వైద్యాధికారి లలితాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.