Ladnapur | రామగిరి, మార్చి 15 : సింగరేణికి సంబంధించి లద్నాపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగిరి మండలంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ 2, లద్నాపూర్, రాజాపూర్ గ్రామాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. లద్నాపూర్ గ్రామంలో ఉన్న ఇండ్ల క్రింద ఉన్న 88 ఎకరాల భూమిని సైతం తప్పనిసరిగా సింగరేణికి అప్పగించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. లద్నాపూర్ గ్రామ ఆర్ అండ్ ఆర్ కాలనీ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు మళ్లింపు, నీటి పారుదల శాఖ కాల్వల మళ్ళీంపు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.
లద్నాపూర్ గ్రామంలోని శ్రీరాముని ఆలయంలో రాబోయే శ్రీరామనవమి వేడుకల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సమస్య లేకుండా సింగరేణి అధికారులు చూసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. డిసెంబర్ 4, 2024న వచ్చిన స్వల్పభూకంపం వల్ల పెద్దపల్లి మంథని రోడ్డు, కాల్వలో చిన్న క్రాక్స్ ఏర్పడ్డాయని, వీటిని సరి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, సింగరేణి రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, ఈఈ ఆర్ &బీ భావ్ సింగ్, రామగిరి తహసిల్దార్ సుమన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.