రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అధికారులు కాంగ్రెస్ నేతకు రాసిచ్చిన వ్యవహారంపై కలెక్టర్ గరిమా అగ్రవాల్ సీరియస్ అయ్యారు. ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’లో ‘రామాలయం రాసిచ్చిండ్రు’ శీర్షికన ప్రచురితమైన కథనం సంచలనం రేపిన విషయం తెలిసిందే కాగా, అదే రోజు జిల్లా అధికారులు స్పందించారు. మరోవైపు నీలోజుపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్‌తో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామాలయం గ్రామ పంచాయతీ ఆస్తి అని, ఓ వ్యక్తికి చెందిన ఆస్తిగా సర్టిఫికెట్ ఎలా జారీ చేస్తారని మండిపడుతూ కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్ లేకపోవడంతో అదనపు కలెక్టర్ కలిసి ఫిర్యాదు చేశారు. మంగళవారం మరోసారి కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్ గరిమా అగ్రవాల్‌ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తహసీల్దార్, ఆర్ఐతోపాటు కాంగ్రెస్ నేత కూస రవీందర్ నిర్వాకంపై వివరించారు. కాంగ్రెస్ నేత ఆస్తిగా మార్చిన రామాలయం ఆస్తిని తిరిగి గ్రామపంచాయతీకి బదలాయించాలని విన్నవించారు. దీంతో కలెక్టర్ స్పందించి, సర్టిఫికెట్ జారీ చేయడంపై సీరియస్ అయ్యారు. సంబంధిత తహసీల్దార్, ఆర్ఐపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారని సర్పంచ్ భాస్కర్, గ్రామస్తులు తెలిపారు.
సీతారామాలయం కాంగ్రెస్ నేత ఆస్తి కాదని, అది గ్రామ పంచాయతీ ఆస్తి అని నీలోజిపల్లి సర్పంచ్‌తోపాటు గ్రామస్తులు స్పష్టం చేశారు. తిరిగి గ్రామపంచాయతీకి బదలాయించాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నీలోజుపల్లి మిడ్ మానేరులో ముంపునకు గురైందని, తర్వాత నర్సింగాపూర్ రెవెన్యూ పరిధిలో ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ క్రమంలో గ్రామస్తులు కలిసికట్టుగా పాత గ్రామ దేవాలయ నిధులు, గ్రామ పంచాయతీ నిధులతో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించుకున్నామని వివరించారు. దేవాలయం ప్రజా ధార్మిక స్థలం కాగా, అధికారిక ఈ పంచాయతీ రికార్డులో అసెస్మెంట్ నంబర్ 312 (2019 ) కింద గ్రామ పంచాయతీ రామాలయంగా నమోదు చేయబడిందన్నారు. ఇది గ్రామ పంచాయతీ ఆస్తి అని స్పష్టమవుతుందని పేర్కొన్నారు. నీలోజుపల్లి మాజీ సర్పంచ్ కూస రవీందర్ బోయినపల్లి తహసీల్దార్‌కు తప్పుడు సమాచారం అందించి, దేవాలయం తన వ్యక్తిగత నిర్మాణమని పేర్కొంటూ దరఖాస్తు చేసుకున్నాడన్నారు. ఆర్ఐ ఎటువంటి స్థల పరిశీలన చేయకుండా, సరైన విచారణ చేయకుండా తప్పుడు నివేదిక సమర్పించారని మండిపడ్డారు. ఆ నివేదిక ఆధారంగా తహసీల్దార్ త్వరితగతిన సరైన పరిశీలన లేకుండా సర్టిఫికెట్ బీ /234/2026ను మార్చి 31, 2026న జారీ చేశారని చెప్పారు. ఈ సర్టిఫికెట్ జారీ చేయడం, సరైన విచారణ లేకపోవడం, అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఇవన్నీ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని తక్షణమే చర్యలు తీసుకొని, సర్టిఫికెట్ రద్దు చేసి దేవాలయం గ్రామ పంచాయతీ ఆస్తి అని ప్రకటించాలని కోరారు. ఇక్కడ ఉపసర్పంచ్ కుసుంబ మహేందర్, మాజీ వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, వార్డు సభ్యులు ఉమ్మారెడ్డి అనిల్‌రెడ్డి, గూడ బాలకిషన్, నాయకులు ఎర్ర ప్రతాప్‌రెడ్డి, అనుముల దేవయ్య, గోనె అనంతరెడ్డి, ఎర్ర మల్లారెడ్డి, తిమ్మాపురం సతీశ్, కత్తెరపాక దేవదర్శన్, ఆవుల నాగరాజు, కొనకటి అంజన్‌కుమార్, ఆవుల లక్ష్మణ్, పెంతల బాల్‌రెడ్డి, బాలమల్లు, ముస్కు నాగరాజు, గూడ రమేశ్, కొనకటి చంద్రయ్య, చెంచు సంపత్, రాజు, ఎల్ల కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.