Prajavani | కలెక్టరేట్, ఆగస్టు 18: ‘ఏళ్ళకేళ్ళుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, అధికారులను బతిలాడుతున్న, అయినా నన్ను పట్టించుకోవటం లేదు. నా సమస్యకు పరిష్కారం చూపటం లేదు. ప్రజావాణికి కూడా వచ్చి చాలా సార్లు ఫిర్యాదు చేసిన, ఇప్పటివరకు నేను పడుతున్న ఇబ్బందులు మాత్రం తీరలేదు. కలెక్టర్ గారు మీరన్నా నాకు, న్యాయం చేయలేదు’ అంటూ కలెక్టరేట్ ఆడిటోరియం ఆవరణలో ఓ భూబాధితుడు ప్లకార్డు ప్రదర్శిస్తూ, నిరసన తెలిపారు. వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన ఓదెల భాస్కర్ కుటుంబానికి గ్రామంలోని సర్వేనెం. 682హెచ్లో పదకొండెకరాల భూమి ఉండగా, అవసరాల నిమిత్తం తొమ్మిదెకరాల పైచిలుకు భూమి విక్రయించినట్లు తెలిపారు. మిగతా ఎకరా పద్దెనిమిది గుంటల భూమి వారి కుటుంబ సభ్యుల పేర ఉండగా, ఆ మొత్తాన్ని కూడా దశాబ్దంన్నర క్రితం తమ భూమి కొనుగోలు చేసిన పురంశెట్టి రాయమల్లు కబ్జా పెట్టినట్లు ఆరోపించారు.
సర్వే చేయించి మిగతా భూమిని స్వాధీనం చేసుకునేందుకు సర్వేయర్‌కు ధరఖాస్తు చేయగా ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటివరకు సర్వే చేయటం లేదు. నాకు భూమి హద్దులు చూపటం లేదని, అధికారులను కలిసిన ప్రతిసారి మా భూమి కబ్జా చేసిన వ్యక్తికి ఫోన్ సమాచారమిస్తుండగా, సదరు వ్యక్తి నన్ను, నాకుటుంబాన్ని చంపుతానంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ నాలుగుసార్లు భౌతికదాడులకు పాల్పడగా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. ప్రజావాణికి సైతం పలుమార్లు వచ్చి ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేకపోవటంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళే క్రమంలో ఫ్లకార్డు ప్రదర్శిస్తూ, ఆడిటోరియం అవరణలో బైఠాయించినట్లు వెల్లడించారు.
అంత్యోదయ రేషన్ కార్డు మంజూరు చేయాలి.. : గజ్జెల రాజమ్మ, దివ్యాంగురాలు, కిసాన్ నగర్
రెండు కాళ్ళు పనిచేయవు. చేతులతోనే నడక, కూతురు గుండె వ్యాధితో బాధపడుతున్నది. భర్త కూలీ చేస్తేనే పూట గడిచేది. లేకుంటే పస్తులుండుడే. ఇలాంటి పరిస్థితుల్లో నాకుటుంబ మనుగడ ఇబ్బందిగా మారింది. నాకు అంత్యోదయ అన్నయోజన పథకం కింద రేషన్‌కార్డు మంజూరీ చేయమ్మా అంటూ నగరంలోని కిసాన్‌నగర్‌కు చెందిన గజ్జెల రాజమ్మ అనే దివ్యాంగురాలు ప్రజావాణిలో కలెక్టర్‌ను వేడుకున్నది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమె పరిస్థితి గమనించి సత్వరమే ఏఏవై కార్డు మంజూరీ చేయాలంటూ పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించగా, దివ్యాంగురాలు రాజమ్మ కలెక్టరు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజావాణిలో 265 ధరఖాస్తులు
క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 265 ధరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు వారి వారి సమస్యలను పేర్కొంటూ లిఖితపూర్వకంగా అధికారులకు అందజేయగా, వాటిని పరిశీలించి ఆయా శాఖల ఉన్నతాధికారులకు అందజేశారు. వెంటనే పరిష్కరించాలంటూ ఆదేశించారు.