ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 19: ‘మేం ఏడేండ్ల కింద కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ టీచింగ్ స్టాఫ్‌గా ఒప్పంద ప్రతిపాదికన నియమితులైనం. రెగ్యులర్ స్టాఫ్లాగే ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నం. కానీ, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు.
పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలి’ అని దుమాల సీవోఈ టీచింగ్ సిబ్బంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు విన్నవించారు. గురువారం దుమాల ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాల, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని బండి సంజయ్ సందర్శించగా, ఈ మేరకు తమ సమస్యలను ఏకరువుపెట్టారు.
ఎంబీబీఎస్, జేఈఈ సీట్లను సాధించడంలో ఎంతో కష్టపడ్డామని, అలాగే టర్మ్-1 పూర్తవుతున్నా ఇప్పటి వరకు జూనియర్, సీనియర్ ఇంటర్ తరగతులుకు ఇంగ్లిష్ లెక్చరర్ లేరని చెప్పారు. ఇక పాఠశాలలో నాన్‌టీచింగ్ సిబ్బంది కొరత ఉన్నదని, 8 మందికి ఇద్దరే పని చేస్తున్నామని, పూర్తిస్థాయిలో నియమించాలని నాన్ టీచింగ్ స్టాఫ్ కోరారు.