karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, మే 17 : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసేందుకు ఉద్యోగుల ఐ కా స ఆధ్వర్యంలో, కార్యచరణ ప్రకటించిన అనంతరమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారని, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. నగరంలోని టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటైన అనంతరం ఉద్యోగుల సమస్యలపై 16 నెలలు వేచి చూసిన అనంతరమే, పలు ఉద్యోగ సంఘాలతో కలిసి ఐక్య కార్యచరణ సమితి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తమ ఇబ్బందులపై ప్రభుత్వము సబ్ కమిటీ ఏర్పాటు చేసి 8 నెలలు గడిచినా, ఇప్పటివరకు తమతో చర్చించకపోవడంతో ఐకాస ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టేందుకు కార్యచరణ ప్రకటించినట్లు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి పలువురు ఐఏఎస్ అధికారులతో కలిపి నవీన్ మిట్టల్ కమిటీ ఏర్పాటు చేసి, తమతో రెండు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలిపారు.
పదవీ విరమణ ప్రయోజనాల కింద పదివేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నదని, ఈ మొత్తం మాత్రమే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతుండటం తప్పా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనివిధంగా తెలంగాణలో ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, దీనిని గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఐఏఎస్ ల కమిటీతో కలిసి ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు కొంత చొప్పున ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రధానంగా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న హెల్త్ కార్డును క్యాష్ లెస్ చేసే విధానం వెంటనే అమల్లోకి తేవాలని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అయినా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను ఎత్తేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని, ఆరోపణలు వచ్చిన ఉద్యోగులకు నెలల తరబడి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులకు గురి చేయటం మానుకోవాలని, ఐఏఎస్ ల కమిటీ మరోసారి చర్చలు జరిపి నిరాశ, నిస్పృహాల్లో ఉన్న ఉద్యోగుల పట్ల సానుకూల నివేదిక అందజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నిర్మించుకున్న భవనాలకు చెల్లించాల్సిన పన్నులు మినహాయిస్తూ గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసినా, ప్రస్తుత ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేసేలా చర్యలు తీసుకుంటుండటము సహేతుకం కాదన్నారు. ఈ సమావేశంలో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్, వాస్తవిక్ గౌడ్, హరిమిందర్సింగ్, నాగుల నరసింహస్వామి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట రామస్వామి, భరద్వాజ్, మహిళ నాయకురాలు సబిత, తదితరులు పాల్గొన్నారు.