BRS leaders | ఓదెల, జూన్ 22 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా పోలీసులు కేసులు పెడుతున్నారని, అదే కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేస్తే కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
పోలీసుల తీరు సరైంది కాదని ఆమె అన్నారు. అక్రమ కేసులకు బీఆర్ఎస్ నాయకులు భయపడేది లేదని, రాష్ట్రంలో మహిళలపై అత్యాచారం జరిగితే నియంత్రించలేని పోలీసులు బీఆర్ఎస్ నాయకులు పై కేసులు పెట్టడానికి ఎందుకు ఉత్సాహం చూపుతున్నారని ప్రశ్నించారు. అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోవింద్ ఎల్ల స్వామి, బండా నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.