ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసానిస్తారని వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఆశగా చూసినా.. చివరకు నిరాశే మిగిలింది. ప్రజాపాలన-విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన ‘యువ వికాసం సభ’ భరోసా నింపలేకపోయింది. సభలో 47 నిమిషాల పాటు ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇచ్చిన హామీల అమలు గురించి, చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా, అధికార వేదికపై ఆద్యంతం రాజకీయ విమర్శలు చేయడంపై సభికుల్లో అసహనం వ్యక్తమైంది. సీఎం మళ్లీ అవే అబద్ధాలు చెప్పారన్న అభిప్రాయాలు వ్యక్తం కాగా, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల ముచ్చటే లేకుండా సభ ముగించడంపై కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సింగరేణిలో మారు పేర్ల మార్పు సమస్యను పరిష్కరించాలని కార్మికుల పిల్లలు సభలో ప్లకార్డులు ప్రదర్శించినా పాలకుల నుంచి స్పందన కరువైంది. ఇటు నియామకపత్రాలు ఇస్తామని తీసుకొచ్చిన అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఖాళీ కుర్చీలు
యువ వికాసం సభకు ప్రజలను పెద్దసంఖ్యలో తరలించారు. అయితే వక్తల ఊకదంపుడు ఉపన్యాసాలతో జనం విసిగిపోయారు. సీఎం శంకుస్థాపనలు చేస్తుండగా వేదికపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతుండగానే వెనుదిరిగారు. సభ ముగిసే సమయానికి సగానికంటే ఎక్కువగా జనం వెనక్కి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎం ప్రసంగం ప్రారంభించే వరకే దాదాపు 30 శాతం కూర్చీలు ఖాళీ అయ్యాయి. సీఎం ప్రసంగించే సమయానికల్లా వెనుక ఉన్న గ్యాలరీలన్నీ బోసిపోయాయి.
కరీంనగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ పెద్దపల్లి, (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు అసెంబ్లీ, సింగరేణి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తోపాటు దాని అనుబంధ కార్మిక సంస్థ ఐఎన్టీయూసీ అనేక హామీలు ఇచ్చింది. కార్మికలోకం అవి నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేసింది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ హామీలు నెరవేరుతాయని ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి పెద్దపల్లికి రావడంతో తమకు తీపి కబురు చెబుతారని కార్మికులు ఆశించారు. కానీ, నిరాశే మిగిలింది.
ఆదాయ పన్ను రద్దు చేసేందుకు కృషి చేస్తామని, సొంత ఇంటి పథకం కింద 250 గజాల జాగ ఇస్తామని, ఇల్లు కట్టుకునేందుకు 20 లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇవేకాదు, కొత్త గనులు ప్రారంభించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామనే అనేక హామీలు ఇచ్చింది. వీటన్నింటిపై సీఎం క్లారిటీ ఇస్తారని కార్మికులు ఆశించినా, ఏ ఒక్క అంశాన్నీ ప్రస్తావించలేదు. కనీసం సింగరేణి ముచ్చటే ఎత్తలేదు. నిజానికి పెద్దపల్లి అంటేనే సింగరేణి గడ్డ. అటువంటిది ఇక్కడకు వచ్చి కనీసం మాట మాత్రం మాట్లాడకపోవడంపై కార్మికులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అలాగే ఇతర మంత్రులు కూడా స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. ఒక సందర్భంలో మంత్రి శ్రీధర్‌బాబు ఐటీ మినహాయింపు అంశాన్ని ప్రస్తావించినట్టు అనిపించినా అంతలోనే మాటమార్చారు. ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా దాట వేశారు.
ప్లకార్డులతో కార్మికుల పిల్లలు
సభలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రసంగిస్తుండగా రామగుండం నియోజకవర్గానికి చెందిన సుమారు 25 మంది సింగరేణి కార్మికుల పిల్లలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. సింగరేణి కారుణ్య నియామకాల్లో డిపెండెంట్ ఉద్యోగ బాధితులమని, మారు పేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులు తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సింగరేణిలో మారు పేర్ల సమస్యను పరిష్కరించాలంటూ నినదించారు. దీంతో సభలో ఏదో జరుగుతున్నదని గ్రహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అక్కడికి చేరుకొని, వారిని శాంతింపజేశారు.
కాళేశ్వరంపై అవే అబద్ధాలు
నిజానికి కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మాత్రమే కాదని ముఖ్యమంత్రితో సహా వేదికపై ఉన్న ప్రతి ఒక్క మంత్రికి తెలిసినా.. అవే అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పనులు పెద్లపల్లి ప్రజల కండ్ల ముందే జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులను ఎలా పూర్తి చేసిందో ఇక్కడ అందరికీ తెలుసు. కానీ, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా సీఎంతోపాటు మంత్రులు ఇష్టానుసారం మాట్లాడారు. ఒక మంత్రి లక్షా 25వేల కోట్లు నీళ్లలో పోశారని, మరో మంత్రి లక్ష కోట్లు ఖర్చుపెట్టారని, చివరకు ముఖ్యమంత్రి లక్షా రెండువేల కోట్లు ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు పని చేయకపోయినా.. తాము రాష్ట్రంలో అధిక పంటలు పండించామంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం పనిచేయకపోతే ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్‌కు గత జూన్‌లో 23 టీఎంసీలు ఎలా ఎత్తిపోశారో..? చెప్పాలన్న ప్రశ్నలు సభ వద్దే ఉత్పన్నమయ్యాయి. అంతేకాదు, లక్షా రెండు వేల కోట్లు మూడు బరాజ్‌లపై పెట్టారా..? లేక కాళేశ్వరం ఎత్తిపోతల కింద వివిధ లింకుల కింద చేపట్టిన పనులకు పెట్టారా..? అన్న దానిపై స్పష్టత ఇవ్వకుండా.. మూడు బరాజ్‌ల విషయాన్ని ఎత్తిచూపి, మరోసారి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినట్టు కనిపించింది.
గ్రూప్-4 అభ్యర్థులకు అవస్థలు
సభలో గ్రూప్-4 సెలెక్ట్ అయిన అభ్యర్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఉద్యోగాలు సాధించిన 8084మందికి పెద్దపల్లి సభలో సీఎం రేవంత్ చేతులమీదుగా నియామక పత్రాలు ఇస్తామని పిలిపించి, కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో నరకం చూశారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో అభ్యర్థులను తరలించగా, ఉదయం 11గంటల వరకే సభకు వచ్చారు. సాయంత్రం వరకు వేచి చూశారు. సభా పరిసరాల్లో పడిగాపులు కాశారు. గ్రూప్-4 ఉద్యోగ స్టాళ్ల వద్ద ఉన్న వారికి ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో నేలపైనే కూర్చున్నారు. కానీ, సభలో 15 మందికి మాత్రమే నియామక పత్రాలు ఇవ్వడంతో మిగతావారు నిరాశ చెందారు. తరలివచ్చిన వారిలో యువతులు, కొందరు బాలింతలు, గర్భిణులు ఉండగా వారి కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో నరకం చూశారు. కనీస సౌకర్యాలు లేక పిల్లలతో వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సభ ప్రారంభమైన తర్వాత బయటికి వెళ్లేందుకు ప్రయత్నించినా అనుమతించలేదు. సీఎం, ప్రముఖుల ప్రసంగాలు పూర్తయ్యే వరకూ ఉండాలని పోలీసులు కరాకండీగా చెప్పడంతో రాత్రి 7.30గంటల వరకు కూర్చోక తప్పలేదు.