రాజన్న సిరిసిల్ల, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాగా, సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ, పోలీస్, సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఇతర శాఖల అధికారులకు దిశానిర్దేశం చేసి వివరాలను వెల్లడించారు. బుధవారం వేములవాడ పట్టణంలో సీఎం పర్యటిస్తారని, అనంతరం రాజన్నను దర్శించుకుని పూజలు చేస్తారని చెప్పారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని, ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. అక్కడి నుంచి అతిథి గృహానికి వెళ్లి, భోజనం చేసి తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలు దేరి వెళ్తారన్నారు. పర్యటన విధులు నిర్వర్తించే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, అదనపు ఎస్పీలు చంద్రయ్య, శేషాద్రినీరెడ్డి, సీఎంవో సెక్యూరిటీ సిబ్బంది, ఆర్డీవో రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.