CM Relief Fund Scheme | కోరుట్ల, జూన్ 16 : పేద ప్రజలకు సీఎం రిలీఫ్ పండ్ పథకం అండగా నిలుస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో లబ్దిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావుతో కలిసి సోమవారం అందజేశారు. ఈసందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం వైద్య ఖర్చులు చెల్లిస్తూ ఆర్ధికంగా ఆదుకుంటుందన్నారు.
అంతకుముందు పట్టణ శివారు వెటర్నరీ కళాశాల సమీపంలో క్రీడా మైదానం కోసం కేటాయించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. కోరుట్లలో క్రీడాకారుల మైదానం ఏర్పాటు కోసం 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో జివాకర్రెడ్డి, తహశీల్దార్ కృష్ణ చైతన్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు తిరుమల గంగాధర్, క్రీడాకారులు, నాయకులు పాల్గొన్నారు.