బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. జననేతకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ ఉదయం నుంచే పట్టణ, మండల, గ్రామాల్లోని ఆలయాల్లో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన, రక్తదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఎవరికి తోచిన విధంగా వారు తమ అభిమాన నాయకుడి కోసం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
జనహృదయ నేత.. బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం సకల జనులు పండుగలా జరుపుకున్నారు. భారీ కేకులు కట్ చేసి, పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. నిరుపేదలకు అన్నదానం, అనాథలకు దుస్తులు, పండ్లు, విద్యార్థులకు సైకిళ్లు, నోట్ బుక్స్, నగదు సాయం వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. పలుచోట్ల కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు. పట్టణాల్లోని చౌరస్తాలు, గ్రామాల కూడళ్లు, పార్టీ కార్యాలయాలు, నేతల క్యాంపు ఆఫీసులు, ప్రభుత్వ దవాఖానలు, పాఠశాలలు, దేవాలయాలు.. ఇలా ఎక్కడ చూసినా ‘జయహో కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్ భావి భారత ప్రధాని అంటూ నినదించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, తమ ప్రియతమ నేత నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని కోరుకున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో బీఆర్స్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. అంతకు ముందు నగర మేయర్ సునీల్‌రావు తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రంథాలయంలో పాఠకులు, నిరుద్యోగ యువతకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. నిరుద్యోగ యువత కోసం ‘గ్రంథాలయ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నిధి’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. నారదాసు వసంతరావు కేంద్ర గ్రంథాలయానికి రూ.10 వేల విరాళం అందజేశారు. కార్ఖానాగడ్డలోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ యూత్ నాయకులు కుల్దీప్ ఆధ్వర్యంలో, రేకుర్తిలోని బీసీ స్టడీ సర్కిల్లో కార్పొరేటర్ ఐలేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్లో మైనార్టీ నాయకుడు ఎండీ జమీలొద్దీన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. రామడుగు మండలం వెలిచాలలోని ప్రశాంత్ భవన్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి, పండ్లు, స్వీట్లు, దుస్తులు పంపిణీ చేశారు. హుజూరాబాద్ పట్టణ పరిధిలో కరోనాతో 70 మంది మృతిచెందగా, వారి కుటుంబ సభ్యులకు 11వ వార్డు కౌన్సిలర్ దండ శోభ ఆమె కొడుకు దండ విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో రూ.1000 చొప్పున రూ.70 వేల నగదు పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్‌కు మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు.
ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ 69 మొక్కలు నాటి, శాంతి కపోతాలను ఎగురవేశారు. ధర్మారంలో 69 కిలోల కేక్ కట్ చేయగా, వెల్గటూర్‌లో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖనిలో పేద ఆటోవాలాకు ఆటోను బహుమానంగా అందజేశారు. అంతర్గాం మండలం గోలివాడలో నిరుపేద కుటుంబానికి ఇంటి నిర్మాణ కోసం భూమి పూజ చేసి, కేసీఆర్ ప్రధాని కావాలని నూకాంబికా ఆలయంలో పూజలు చేశారు.