‘కాంగ్రెసోళ్లు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు. ఏం ఉద్దరించిన్రని తెస్తున్నరు? ఇందిరమ్మ రాజ్యం తెస్తే ఏమచ్చింది? జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడను కల్లోలిత ప్రాంతాలుగా డిక్లేర్ చేసిన్రు కదా.. ఎంతో మందిని పిట్టల్లెక్క కాల్చి చంపిన్రు కదా.. ఎంత ఘోరం ఉండె. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండె. దళితులు, గిరిజనులు, రైతులు బాగుపడ్డరా..? ప్రజలను పట్టించుకున్నరా..? సాగునీరు లేక భూములన్నీ ఎడారిగా మారినయి. గుక్కెడు తాగునీటి కోసం ఏడ్చినం.
ఎంతో మంది బొంబయి, దుబాయి వలసలు పోవడం తప్ప ఏం ఒనగూరింది? మళ్లీ ఇందిరమ్మ రాజ్యం అంటున్నరు కదా.. మమ్మల్ని బొందపెట్టడానికా.. చీకటి రోజులు తెచ్చేందుకా.. ఎవరికి కావాలె నీ ఇందిరమ్మ రాజ్యం’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. జగిత్యాల, వేములవాడలో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన హాజరై, సమైక్య పాలనలో అనుభవించిన కష్టాలు.. స్వరాష్ట్రంలో సాధించిన విజయాలను వివరించారు.
తెలంగాణను ముంచింది తెలంగాణ కాంగ్రెసోళ్లేనని, ఆంధ్రోళ్ల కంటే ఎక్కువగా నష్టం చేసింది వాళ్లేనని మండిపడ్డారు. రాయి ఏదో.. రత్నం ఏదో గుర్తించాలని, యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలన, పదేండ్ల బీఆర్ఎస్ పాలనను చూడాలని కోరారు. ఎవరో చెప్పారని, లేదా ఎవరో ఏడ్చారని ఓటు వేస్తే.. ఆ తర్వాత మనం ఏడువాల్సి వస్తుందని, అందుకే ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థులు సంజయ్ కుమార్, చల్మెడ లక్ష్మీనరసింహారావు విద్యావంతులు, ప్రజాసేవకులని, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు.
కరీంనగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జగిత్యాల, నమస్తే తెలంగాణ : ‘ఇప్పుడిప్పుడే తెలంగాణ తేరుకుంటున్నది. రైతుల బతుకులు బాగు పడుతున్నయి. 24 గంటల కరెంటు ఇచ్చుకుంటున్నం. ప్రాజెక్టులు కట్టి బ్రహ్మండగా సాగునీరు ఇచ్చుకుంటున్నం. కరవు ప్రాంతాలకు కూడా జలాలు వచ్చి రైతులు సంతోషంగా ఉన్నరు. రైతులు బాగుపడాలని రైతు బంధు ఇస్తున్నం’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. అంతా మంచిగున్న సమయంలో కాంగ్రెసోళ్లు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని, మళ్లీ చీకటి రోజులు తెచ్చేందుకేనా..? జైల్లో వేసేందుకేనా..? అంటూ మండిపడ్డారు. ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నది? పదేండ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉన్నదో.. గ్రామాల్లో చర్చ పెట్టాలని కోరారు.
రాయి ఏదో.. రత్నం ఏదో గుర్తించాలని, ఈ ప్రాంతాల బాధలు ఎవరి ద్వారా తీరాయో.. చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థులు డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్, చల్మెడ లక్ష్మీనరసింహారావును గెలిపించాలని కోరారు. జగిత్యాల, వేములవాడలో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పడ్డ గోసలను గుర్తు చేస్తూనే.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని అర్థమయ్యేలా వివరించారు. రాష్ర్టాన్ని ఆంధ్రోళ్ల కంటే ఎక్కువగా ముంచింది తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలేనని ధ్వజమెత్తారు. వాళ్ల చేతగాని తనం వల్లే అరవై ఏండ్ల పాటు ఇక్కడి ప్రజలు అరిగోస పడ్డారని గుర్తు చేశారు.
సాగు, తాగునీరు లేక ఆగమయ్యారని, భూములు బీడు పడి బొంబయి, దుబాయి బాట పట్టారని, ఆనాడు రైతులు, నేతన్నలు చావులు ఇక్కడ నిత్యకృత్యమయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడినంక పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉన్నాయని, ఆ స్థితిలో తెలంగాణను రేవుకు తేవాలని ఆలోచించామని, మెల్లిమెల్లిగా అభివృద్ధికి తోవ చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు మంచిగా అభివృద్ధి జరుగుతుంటే.. కాంగ్రెస్ నాయకులు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ వస్తున్నారని, ఎవరిని గోల్మాల్ చేయడానికని ప్రశ్నించారు. నాటి ఇందిరమ్మ రాజ్యంలో జగిత్యాల, సిరిసిల్ల వేములవాడ ప్రాంతాలు కల్లోలిత ప్రాంతాలుగా డిక్లేర్ అయ్యాయని, ఇక్కడి బిడ్డలను కాల్చి చంపారని, అప్పుడు ఎంత ఘోరం ఉండే, ఎంత భయకరం ఉండే అంటూ ఆ నాటి రోజులను గుర్తు చేశారు.
ఇందిరమ్మ రాజ్యంతో ఎవరు ఉద్దారమయ్యారని, ‘దళితులు బాగుపడ్డరా.. గిరిజనులు బాగు పడ్డరా.. రైతులు బాగు పడ్డరా.. ప్రజలను పట్టించుకున్నారా..? వాళ్లను ఓటు బ్యాంకును చేసి ఓట్లు తీసుకొని రాజ్యమేలిన్రు తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. ‘ఎన్కటికి ఒకడు అన్నడట.. తద్దినమని భోజనానికి పిలిత్తే మీ ఇంట్ల రోజు ఇట్లనే కావాలన్నడట’ అట్లున్నది కాంగ్రెసోళ్ల తీరని విమర్శించారు. ‘ఇందిరమ్మ రాజ్యం మమ్మల్ని బొందపెట్టడానికా..? అప్పుడే 400 మందిని పిట్టల్లెక్క కాల్చి చంపిన్రు కదా.. లక్షల మందిని జైళ్లలో ఏసిన్రు కదా.. ఎమర్జెన్సీ పెట్టి దేశం మొత్తం చీకటి రోజులను తెచ్చింది కదా.. ఎవరికి కావాలే నీ ఇందిరమ్మ రాజ్యం? నలుపెందో.. తెలుపేందో ప్రజలకు తెల్వదా..? అమాయకులా..?’ అని ప్రశ్నించారు. తెలంగాణలో మళ్లీ కాల్చి చంపే ఎమర్జెన్సీ ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తారా..? అంటూ ధ్వజమెత్తారు.
ప్రజలంతా ఆలోచన చేయాలని, ఎవరేందో చూడాలని సూచించారు. ఏమాత్రం ఏమరపాటుగా ఓటు వేసినా.. ఆగం కావాల్సి వస్తుందని చెప్పారు. జగిత్యాల ప్రజా ఆశీర్వద సభలో రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, మాజీ మంత్రి రాజేశంగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్లు గోలి శ్రీనివాస్, మోర హన్మాండ్లు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓరుగంటి వెంకట రమణరావు, ఐల్నేని సాగర్‌రావు, కొలుగూరి దామోదర్‌రావు, ఐల్నేని సాగర్‌రావు.. వేములవాడ ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోకబాపురెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ర్టాన్ని ఆంధ్రోళ్లకంటే ఎక్కువగా ముంచింది తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలే. 2004లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా ధోఖా చేసింది. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణరావు అని ఉండే. ఆయన మాతో మీరు గెలిచారా..? మీతోని మేం గెలిచినమా..? దమ్ముంటే రుజువు చెయ్ కేసీఆర్ అని సవాల్ విసిరిండు. నేను వెంటనే రాజీనామా చేసి ఆయన మొఖం మీద కొట్టిన. అప్పుడు నేను ఎంపీగా మళ్లీ పోటీ చేసిన. సమైక్యవాదుల తరఫున జీవన్‌రెడ్డి నాపై పోటీ చేసిండు. మీరందరూ సాక్ష్యులే. ఆనాడు మీరు 2.50లక్షల బంపర్ మెజార్టీతో గెలిపించిన్రు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు లేపిన్రు. ఆ పోరాటం మీ కండ్ల ముందే జరిగింది.
– ముఖ్యమంత్రి కేసీఆర్
కాంగ్రెస్ గట్టిగా నిలబడి ఉంటే.. ఈ గతి మనకు ఎందుకు? ఈ పరిస్థితి ఎందుకు? మీ దగ్గరనే ఓ మంచి ఉదాహరణ ఉన్నది. జగిత్యాల పక్క నుంచే గోదావరి వెళ్తున్న ఇక్కడి ప్రజలకు తాగునీటిని అందించలేదు. నాడు వరద కాలువలో బురద కూడా ఉండేది కాదు. నాలుగు తూములు పెట్టి చెరువులు నింపలేదు. ఏమన్నా కొన్ని వాన నీళ్లకు రైతులు నాలుగు మోటర్లు పెట్టుకుంటే, ఆ మోటర్లను పోలీస్‌స్టేషన్‌లో పెట్టేది. కరీంనగర్, చొప్పదండి, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో వరద కాలువ దుస్థితి, తూములు లేని దైన్యాన్ని చూసి నా కడుపు తరుక్కుపోయింది. తెలంగాణ వచ్చినంక గోదావరిని నిండకుండలా మార్చుకున్నం. వరదకాలువకు జీవం పోసినం. తూములు పెట్టి చెరువులు నింపుకున్నం. రోళ్లవాగు ప్రాజెక్టు కట్టుకున్నం. ఇవన్నీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు కాలేదు? వాళ్లకు ఈ మందం చేతకాలేదు.
– జగిత్యాలలో ముఖ్యమంత్రి కేసీఆర్
జగిత్యాలలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఈ రోజు నుంచే జగిత్యాలలో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమైంది. ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవడంతో పాటు జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలను గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తం. డాక్టర్ సంజయ్‌కుమార్‌కు వేసే ప్రతి ఓటు తనకు వేసినట్లే భావించి కారు గుర్తుకు వేయాలని కోరుతున్న.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి
కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా చూడాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నరు. అభివృద్ధ్ది పనులు, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు కొనసాగాలంటే కేసీఆర్ ప్రభుత్వమే రావాలి. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి జగిత్యాలలో డా. సంజయ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
– జగిత్యాలలో రాజేశంగౌడ్, మాజీ మంత్రి
సాగు, తాగునీటి కోసం తండ్లాడిన మన మెట్ట ప్రాంతాన్ని తరి ప్రాంతంగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. వేములవాడ గడ్డపై రాజకీయ యుద్ధం జరుగుతున్నది. అభివృద్ధిని చూసి పనిచేసే పార్టీకి పట్టంగట్టాలి. ఒకప్పుడు సాగునీటికి తాగునీటి కోసం కటకటలాడిన ఈ ప్రాంతాన్ని గోదావరి జలాలతో 55వేల ఎకరాలు సస్యశ్యామలం చేసినం. మలపేట రిజర్వాయర్ పూర్తి చేయడమే కాకుండా నిమ్మపల్లి చెరువును కూడా నింపిమూల వాగును జీవనదిగా మార్చబోతున్నం. రూ.800కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు అందించినం. పట్టణంలోనూ 9వేల నివాసాలకు ఇస్తున్నం.
కలికోట సూరమ్మ రిజర్వాయర్‌ను పూర్తి చేయాలని, అది పూర్తయితే మరో 46వేలకు సాగునందుతుందని సీఎంను కోరుతున్న. ముంపు గ్రామాల మిగిలిన పరిహారాన్ని వెంటనే విడుదల చేసి, 100 ఎకరాల్లో ఆగ్రో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని నా విజ్ఞప్తి. రాజన్న ఆలయంలోని అనువంశిక అర్చకుల సమస్యలు కూడా పరిషరించాలని విజ్ఞప్తి చేస్తున్న. కోనరావుపేట మండలంలో 52వేల జనాభా దాటినందున మరో మండలాన్ని, కథలాపూర్ మండలంలోనూ ఇంకో మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్న. కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా చేసుకుంటేనే ఇవన్నీ సాధ్యమవుతయి.
– వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు
సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, ఎమ్మెల్సీ కవిత సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన. డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో రాష్ట్రంలో ఏ పట్టణానికి దక్కని ప్రాముఖ్యతను సీఎం కేసీఆర్ మన జగిత్యాలకు ఇచ్చిండు. 4500 ఇండ్లు మంజూరు చేసిండు. కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి, ఇటీవలే 3720 ఇండ్లను లబ్ధిదారులకు అందించిన. 2018 ఎన్నికల ప్రచారం సందర్భంగా జగిత్యాలకు మెడికల్ కళాశాల, 100 పడకల ఎంసీహెచ్ మంజూరు చేస్తానని మాట ఇచ్చిన నెరవేర్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్. మెడికల్ కళాశాల, మాతా శిశు కేంద్రంతో పేదలకు వైద్య సేవలు అందుతున్నయి. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నడు.
త్వరలోనే పీఎఫ్‌తో సంబంధం లేకుండా మిగతావారికి అందిస్తం. నిత్యావసరాల ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కులేదు. జీవన్‌రెడ్డి తన 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవిత, తన పదవీ కాలంలో చేయని అభివృద్ధి పనులను నేను ఐదేండ్లలోనే చేసి చూపిన. ఆయన ఎలాగైన గెలువాలని ప్రజలను రెచ్చగొడుతున్నడు. జగిత్యాల మాస్టర్ ప్లాన్‌ను ఇప్పటికే రద్దు చేశామని స్పష్టంగా చెప్పినప్పటికీ జీవన్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నడు. ఆయన చెప్పే ప్రతిమాట అబద్ధమే. ఆయనపై ఎలక్షన్ కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేసినం. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్త.
మహా నాయకుడు సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో వేములవాడ అభివృద్ధిని ఆకాంక్షించి ఒక విజన్‌తో నేను మీ ముందుకు వస్తున్న. ఒకసారి అవకాశం ఇవ్వండి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుత. ఇకడి మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు చూపుత. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్త. మధ్యమానేరు కేంద్రంగా పర్యాటక హబ్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న.
రాజన్న దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్త. నాకు ఏ పదవి లేనప్పుడే నా సొంత గ్రామంలో కోట్లు పెట్టి బడి, గుడి కట్టించిన. ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్త. సమైక్య రాష్ట్రంలో అనేక మండలాలు సాగు నీటి కోసం అల్లాడిపోయినయ్. సాగు చేయలేక బతుకుదెరువు లేక కొంతమంది గల్ఫ్ బాటపడితే, మరికొంత మంది అడవిబాట పట్టి ఆగమైపోయిన్రు. కానీ తెలంగాణ వచ్చాక నీటి వసతులు పెరిగి పసిడి పంటలు పండిస్తున్నరు.
వలస వెళ్లిన వారు తిరిగివచ్చి ఉన్న ఊళ్లోని వ్యవసాయం చేసుకుంటున్నరు. రూ.996 కోట్లతో చేపట్టిన మలాపూర్ రిజర్వాయర్‌ను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే త్వరితగతిన ప్రారంభిస్తే వేములవాడ, కోనరావుపేట మండలాల్లో కొత్తగా 31,680 ఎకరాలకు సాగునీరందుతుంది. కలికోట చెరువును నింపితే, మరో లక్ష ఎకరాలకు నీరందుతుంది.
-వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు