హుస్నాబాద్, ఫిబ్రవరి 20: గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి నిధులిచ్చేందుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. సోమవారం హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో నియోజకవర్గస్థాయి నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సాగునీటి పనులు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిడ్‌మానేరు ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో 27వేల ఎకరాలు, దేవాదుల ద్వారా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని 17గ్రామాల్లో 18వేల ఎకరాలు, కాకతీయ కాలువ ద్వారా 6,500 ఎకరాలు, సింగరాయ ప్రాజెక్టు ద్వారా 10వేల ఎకరాలు, శనిగరం ప్రాజెక్టు ద్వారా 22వేల ఎకరాలు, మహాసముద్రం గండి ద్వారా 16 గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయాన్నారు. త్వరలోనే గౌరవెల్లి ద్వారా 96వేల ఎకరాలు, గండిపల్లి ద్వారా 44వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు చెప్పారు.
గౌరవెల్లి రైట్, లెఫ్ట్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి రూ.200.20 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ వేసవిలోపే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి రిజర్వాయర్‌ను ప్రారంభించుకుంటామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 600 శాతం పంటల దిగుబడులు పెరిగాయన్నారు. నియోజకవర్గంలోని 746 చెరువులు, కుంటలకు గాను 574 మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ పట్టణం అనూహ్యంగా అభివృద్ధి చెందిందనడానికి రెండు జాతీయ అవార్డులు రావడమే నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో 17 కొత్త విద్యుత్ సబ్స్టేషన్లు, 1,448ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. ఎల్కతుర్తి-సిద్దిపేట హైవేతో పట్టణం పూర్తిగా మారిపోతుందని, కొత్తపల్లి-జనగామ హైవేకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. త్వరలో హుస్నాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన ఉందని, దీంతో మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు.
ఎల్లమ్మ చెరువు మినీట్యాంక్ బండ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. చిగురు మామిడికి చెందిన ఇరిగేషన్ సమస్యలను ఎంపీపీ కొత్తవినీతాశ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ బేతిరాజి రెడ్డి వివరించారు. సమావేశంలో హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్ఈ సుమతీదేవి, ఈఈలు రాములునాయక్, నారాయణ, రమేశ్, ఏసీపీ సతీశ్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీలు మానస, మాలోతు లక్ష్మి, కొక్కుల కీర్తి, కొత్త వినీత, ప్రభాకర్‌రెడ్డి, అనిత, జడ్పీటీసీలు భూక్యా మంగ, నాగరాజు శ్యామల, వంగ రవీందర్, చిగురుమామిడి విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశం, సైదాపూర్ ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, వెన్నంపల్లి విండో చైర్మన్ వెంకటరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమరపు రాజయ్య పాల్గొన్నారు.