జూలపల్లి, మే 15 : దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అంబేద్కర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జూలపల్లి మండలం తేలుకుంటలో సోమవారం మండలి చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాద్‌రావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి మంత్రి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నివాళులర్పించి, మాట్లాడారు. రాష్ట్రంలో 40 వేల దళిత కుటుంబాలు ‘దళితబంధు’ ద్వారా లబ్ధిపొందుతూ తలెత్తుకుని జీవిస్తున్నాయన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ యేడాది 1100 కుటుంబాలకు దళితబంధు కింద 10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ విడుతల వారీగా దళితబంధు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష పార్టీల మాయమాటలు, అపోహలు పట్టించుకోవద్దని పేర్కొన్నారు. ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అందరి వాడుగా ప్రజలను చైతన్యవంతం చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని, అందులో 98 శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. రాష్ట్రంలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా తొలుత 33 శాతం సర్కారు బడులు ఎంపిక చేసి ప్రైవేటుకు దీటుగా ఆధునిక వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జూలపల్లి జడ్పీటీసీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్ తయారు చేయించిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం’ డిజిటల్ బుక్‌ను మంత్రి విడుదల చేశారు.
ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కాలువ మల్లయ్య రాసిన జీవితం అంటే ఏమిటి? అనే తాత్విక గ్రంథాన్ని ఆవిష్కరించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన కాచాపూర్‌కు చెందిన అక్కెపెల్లి అఖిల్‌కు శాలువా కప్పి మంత్రి అభినందించారు. కాగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కమిటీ చైర్మన్‌గా మంత్రి ఈశ్వర్ చేసిన కృషి అభినందిస్తూ నిర్వాహకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఇక్కడ జడ్పీ వైస్ చైర్మన్ మండిగ రేణుక, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, సర్పంచులు సొల్లు పద్మ, దారబోయిన నరసింహం, బంటు ఎల్లయ్య, కుంటూరి రాజయ్య, కొత్త శకుంతలరవీందర్, తొంటి పద్మబుచ్చయ్య, ఎంపీటీసీ సభ్యులు కత్తెర్ల శ్రీనివాస్, తమ్మడవేని మల్లేశం, దండె వెంకటేశం, తాసిల్దార్ గొట్టె జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శనీయుడు అంబేద్కర్..
భరతమాత ముద్దుబిడ్డ అంబేద్కర్ జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ఆర్టికల్-3 ద్వారా చిన్న రాష్ర్టాల ఏర్పాటుతో తెలంగాణ సాధించుకున్నాం. విద్య ద్వారా సమాజంలో ఉన్నత వ్యక్తిత్వం సాకారమవుతుంది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సీఎం కేసీఆర్ దళితబంధు అమలు చేస్తున్నారు.
– మండలి చీఫ్‌విప్ భానుప్రసాద్‌రావు
అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి..
అంబేద్కర్‌ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా ఎదిగి సమాజ సేవలో భాగస్వాములు కావాలి. అంబేద్కర్ అణగారిన కుటుంబంలో పుట్టి ప్రపంచ మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి స్ఫూర్తి నింపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో మార్పు తీసుకురావాలి.
-ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి