కరీంనగర్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మంత్రి గంగుల కమలాకర్‌ను పరామర్శించారు. ఈ నెల 4న మంత్రి గంగుల తండ్రి మల్లయ్య మరణించిన విషయం తెలిసిందే. కాగా, అదే రోజు ఫోన్ ద్వారా సీఎం కేసీఆర్ మంత్రిని ఓదార్చారు. సోమవారం మల్లయ్య ద్వాదశ దిన కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరిన ముఖ్యమంత్రి, స్థానిక పోలీస్ శిక్షణా కేంద్రంలోని హెలీప్యాడ్‌కు 11:55 గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రగతి రథం బస్సులో ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు.
మంత్రి గంగుల తండ్రి మల్లయ్య చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగులను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. మంత్రి సోదరులతోపాటు కుటుంబ సభ్యులందరినీ పలుకరించి ధైర్యం చెప్పారు. కొద్ది సేపటి తర్వాత హెలీకాప్టర్‌లో తిరిగి హైదరాబాద్ వెళ్లారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు కొప్పు ల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్‌కుమార్, డాక్టర్ ఎన్ సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ,
మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణగౌడ్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు సర్దార్ రవీందర్‌సింగ్, బండ శ్రీనివాస్, అనిల్ కుర్మాచలం, కోలేటి దామోదర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ప్రతిమ సంస్థల చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, గెల్లు శ్రీనివాస్, కర్ర శ్రీహరి, ఓరుగంటి ఆనంద్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం రాక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు శిక్షణ కేంద్రం నుంచి కొండ సత్యలక్ష్మి గార్డెన్‌కు చేరుకునే మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. 15 నుంచి 20 నిమిషాల్లో సీఎం కేసీఆర్ పర్యటన ముగిసింది. హెలీప్యాడ్ వద్ద మంత్రి ఈశ్వర్, వినోద్‌కుమార్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు.