ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 25: కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ ద్వారా నీరందించలేని వీర్నపల్లి, కోనరావుపేట మండలాల్లోని గ్రామాల్లో ప్రతి ఎకరాకు ప్రయోజనం చేకూరేలా నాలుగు లిఫ్టులతో నీటిని ఎత్తిపోయించేందుకు సీఎం కేసీఆర్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇందుకు అవసరమైన నిధులను రూ.166 కోట్లను మంజూరు చేశారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి సింగసముంద్రం గ్రావిటీ కాలువ ద్వారా ద్వారా ఎల్లారెడ్డిపేట అల్మాస్పూర్ పంప్‌హౌస్ వరకు నీళ్లు రానుండగా, అక్కడి నుంచి లిఫ్టు ద్వారా వీర్నపల్లి మండలంలోని రాయినిచెరువు నింపేందుకు ఒక పక్క పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చెరువును పటిష్టం చేసేందుకు శనివారం నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పనులు ప్రారంభించారు.
ఇందులో భాగంగా ఆరు మీటర్ల వెడల్పుతో 375 మీటర్ల పొడవునా కట్టను పటిష్టం చేయనున్నారు. మత్తడి మరమ్మతుతో పాటు రెండు కొత్త తూములను ఏర్పాటు చేయనున్నారు. 15.716 కిలోమీటర్ల నిడివిగలిగిన చిట్టి కాల్వలను(ఎడమ, కుడి) నిర్మించనున్నారు. మే నెల వరకు పనులను పూర్తి చేసి రాయిని చెరువు కింద ఉన్న మద్దిమల్ల రాయినిచెరువు, కంచర్ల వెంకట్రాయని చెరువు, కంచర్ల రేండ్ల కుంట, కంచర్ల పోతరాయని కుంట, అల్మాస్పూర్ రంగం చెరువుల్లో నీళ్లు నింపేలా ప్రణాళికలు చేస్తున్నారు. మరో వైపు రాయినిచెరువు ఎగువన ఉన్న చెరువులు నింపేందుకు మూడు లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు. కాగా మొత్తం లిఫ్టులు పూర్తయితే సుమారు 13 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయిని చెరువు మరమ్మతు పనులకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి శనివారం న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మల్కపేట రిజర్వాయర్ నుంచి లిఫ్ట్‌ల ద్వారా మెట్ట భూములకు నీరందించేందుకే రాయిని చెరువును పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య పేర్కొన్నారు.
ఇక్కడ వీర్నపల్లి జడ్పీటీసీ గుగులోత్ కళావతి, ఎంపీపీ మాలోత్ భూలా, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, సర్పంచులు మాలోత్ జవహర్లాల్, జెజ్జెర కనకవ్వ, గుగులోత్ కళ, పాటి దినకర్, కో-ఆప్షన్ సయ్యద్ ఉస్మాన్, సభ్యులు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ శ్రీనివాస్, నాయకులు మాలోత్ సంతోష్, ప్రకాశ్ నాయక్, జెజ్జెర నాగరాజు, ఎండీ రఫీ, గుగులోత్ శ్రీరాం, టీ. భాస్కర్, బానోత్ విఠల్, మ్యాకల శ్రీనివాస్, నరహరి, రవి పాల్గొన్నారు.
మద్దిమల్ల, వీర్నపల్లి, కంచర్ల గ్రామాల దశాబ్దాల కల మంత్రి కేటీఆర్ చొరవతో నిజమవుతున్నది. ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు వచ్చినా ఇంతటి అభివృద్ధి చేయలేరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చెరువును నింపేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటారు. ఎనిమిది చెరువులను నింపడంతోపాటు మద్దిమల్లలోని ప్రతి ఎకరా సాగులోకి వచ్చేందుకు తుంగ చెరువును కూడా నింపాలని అధికారులను కోరాం. ప్రతి ఎకరం సాగయ్యేలా మంత్రి కేటీఆర్ సహకారంతో పనులను పూర్తి చేస్తాం.
– కొండూరు రవీందర్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్
సాగునీరు లేక ఇంట్లోళ్లందరినీ వదిలి ముంబాయి, దుబాయి పోయినోళ్లను.. పశువులకు నీళ్లు లేక గంగకు పోతున్నమని ఊళ్లు వదిలి ఏండ్ల కొద్ది పోయిన రోజులను ఎప్పటికీ మర్సిపోలేం. ఊరునే నమ్ముకుని ఊళ్లెనే బతుకుదామనుకున్న గిరిజనానికి మంచిరోజులు వచ్చినట్లే. రాయిని చెరువు నిర్మాణం 35 ఏండ్ల కింద ఓ పెద్ద యజ్ఞంలా సాగింది. ఇందులో అనేక మంది భాగస్వామ్యమున్నది. అయినా పూర్తి రూపం రాలేక పోయింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ రవీందర్రావు సహకారంతో నేడు గ్రామస్తుల ఏండ్ల కల నెరవేరనున్నది.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు