ప్రభుత్వం ఒక కార్యక్రమం అమలు చేసే ముందే అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తుంది. ఆ తర్వాతే కార్యాచరణ మొదలు పెడుతున్నది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఈ నెల 5 నుంచి 9 వరకు ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని గ్రామాల్లో అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినా.. నిర్వహణకు ఒక్క పైసా ఇవ్వకపోవడం, ఏ పంచాయతీలో చూసినా నిధులు లేక పోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఆ కార్యక్రమం కార్యదర్శులకు భారంగా మారుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇటీవల బదిలీ అయిన సెక్రటరీలు ఇంతకు ముందున్న గ్రామాల్లో అప్పులు చేసిన పనుల బిల్లులు కూడా రాలేదు. ఇపుడు కొత్త పంచాయతీల్లోనూ తిరిగి ఇదే పరిస్థితి ఎదురవక తప్పదనే ఆందోళనలో కనిపిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాలతో పనులు చేయాలని ఒత్తిడి తెస్తున్న అధికారులు.. జీపీల్లో నిధులు ఉన్నాయా.. లేవా..? అనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.
కరీంనగర్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు గ్రామాల్లో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇది పూర్తయిన తర్వాత ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు నాలుగైదు రోజులుగా కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు, జిల్లా అధికారులను సమయాత్తం చేస్తున్నది. అయితే అందుకు అవసరమైన నిధులను మాత్రం ఇవ్వలేదని తెలిసింది.
గతంలో వానకాలానికి ముందు తీ సుకోవాల్సిన జాగ్రత్తలపై అప్పటి బీఆర్ఎస్ ప్రభు త్వం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకునేది. అందుకు అవసరమైన నిధులను పల్లె ప్రగతి కింద విడుదల చేసేది. కొన్ని సందర్భాల్లో నిధులు ఇచ్చే పరిస్థితి లేకున్నా పంచాయతీలకు పెండింగ్ నిధులైనా విడుదల చేసి వాటిని వాడుకోవాలని సూచించేది. కానీ, ఇపుడు అలాంటి పరిస్థితి కూడా లేక పోవడంతో భారమంతా కార్యదర్శులపైనే పడనున్నది.
పైసలు లేకుంటే పనులెట్లా..?
ఫిబ్రవరిలో సర్పంచుల పదవీ కాలం ముగియగా, కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలను నిలిపేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వడం లేదు. ఇటీవల ఎస్ఎఫ్సీ గ్రాంట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది జీత భత్యాలు చెల్లించాలని సూచించింది. దీంతో మే నెల వరకు ఉన్న వేతన బకాయిలను కార్యదర్శులు చెల్లించారు. ఇంటి పన్నులు, నల్లా బిల్లులు కూడా సరిగ్గా వసూలు కాకపోవడంలో పంచాయతీల్లో జనరల్ ఫండ్ కూడా లేకుండా పోయింది.
ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రాక, స్థానికంగా పన్నులు వసూలుకాక పంచాయతీ ఖజానాలు పూర్తిగా నిండుకునే పరిస్థితి ఏర్పడింది. కొన్ని మేజర్ పంచాయతీలు జనరల్ ఫండ్‌తో నెట్టుకొస్తున్నా చిన్న పంచాయతీలు మాత్రం ఆర్థిక భారంలో చిక్కుకుని ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మేజర్, మైనర్ అనే తేడా లేకుండా అనేక పంచాయతీల్లో పారిశుధ్యలోపం ఏర్పడుతున్నది. పారిశుధ్య నిర్వహణ కోసం గత ప్రభుత్వం సమకూర్చిన ట్రాక్టర్లలో డీజిల్ లేక అనేక పంచాయతీల్లో మూలన పడ్డాయి.
ప్రతి రోజూ చెత్తను తీసుకెళ్లి డంప్‌యార్డులో వేసే ఆ ట్రాక్టర్లు ఇప్పుడు వీధుల్లో తిరగకపోవడంతో చెత్తకుప్పలతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు సొంత డబ్బులతో ట్రాక్టర్లను నిర్వహిస్తున్నారు. 30వేల నుంచి లక్ష, 5లక్షల వరకు ఒక్కో గ్రామంపై ఖర్చుచేసి ఉన్నా రు. ఈ బిల్లులు రాకముందే పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారు. ఇప్పుడు ఆ బిల్లులు తీసుకునేది ఎలాగని కార్యదర్శులు మదన పడుతున్న నేపథ్యంలో ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. అందుకు అవసరమైన నిధులను మాత్రం సమకూర్చడం లేదని తెలిసింది.
భారమంతా కార్యదర్శులపైనే
ఓ పక్క పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పా లన సాగుతున్నది. సర్పంచుల పదవీ కాలం ము గిసి ఎనిమిది నెలలవుతుండగా, జీపీల నిర్వహణ భారమంతా కార్యదర్శులపైనే పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు రాక, స్థానికంగా బిల్లులు వసూలుకాక పోవడంతో ఖజానాలో నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో వసూలైన పన్నులు, బిల్లులు ట్రెజరీలో జమచేస్తే తిరిగి తీసుకోవడానికి వీలు లేకుండా ఫ్రీజింగ్ కొనసాగుతున్నది. ఏ చిన్న అవసరం ఏర్పడినా కార్యదర్శులు పంచాయతీ నిధుల కంటే తమ జేబు నుంచి పెట్టినవే ఎక్కువని తెలుస్తున్నది.
నిధులు లేని జీపీల్లో పనుల నిర్వహణకు సెక్రె టరీలు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే అప్పుల భారం మోయలేక పోతున్న తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు బదిలీలు వారికి శాపంగా మారాయి. తాము పనిచేసిన పాత పంచాయతీల్లో అనేక మందికి బిల్లులు రావాల్సి ఉందని, అక్కడి నుంచి బదిలీ అయిన తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ప్రతి దానికి పైసలే అవసరం
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5 నుంచి 9 వరకు చేపట్టిన ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ నిర్వహించాలంటే ప్రతి దానికీ నిధులు అవసరముంటుంది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిధులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ, సోమవారం నుంచి ఐదు రోజులపాటు కార్యక్రమాలు ఎలా నిర్వహించేదని కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు.
గ్రామ పంచాయతీల వారీగా బృందాలను ఏర్పాటు చేయడం, కార్యక్రమానికి ముందే ప్రభుత్వ కార్యాలయాలపై వాల్ పేయింట్ చేయించడం, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం, వసతి గృహాలు, పాఠశాల ఆవరణల్లో వర్షపు నీరు నిల్వకుండా చేయడం, తడి పొడి చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు తరలించడం, ప్రతి రోజూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం, ఉన్న సిబ్బంది సరిపోకుంటే అదనంగా కూలీలను ఏర్పాటు చేసుకోవడం, ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు వంటివి సేకరించడం, ప్రతి రోజూ మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఏది చేయాలన్నా సరిపడా నిధులు అవసరముంటుంది.
పంచాయతీల్లో నిధులు లేని అనేక చోట్ల తమపైనే భారం పడుతుందని కార్యదర్శులు వాపోతున్నారు. ఇప్పటికైనా పంచాయతీల పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రభుత్వం సరిపడా నిధులు సమకూరిస్తే ఐదు రోజుల ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
పంచాయతీలకు నిధులు వస్తాయి
స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు ఇస్తుంది. గ్రీనరీకి సంబంధించిన నిధులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు విడుదల చేశారు. ఇతర కార్యక్రమాల కోసం పంచాయతీల నుంచి రిక్వరీమెంట్ తీసుకున్నారు. ఇప్పటి వరకైతే ప్రొసీడింగ్స్ రాలేదు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం తప్పక ఉంటుంది. చాలా పంచాయతీల్లో నిధులు కూడా ఉన్నాయి.
– రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి (కరీంనగర్)